చర్చలు విఫలం.. ఏపీఎస్‌ ఆర్టీసీలో సమ్మె?

చర్చలు విఫలం.. ఏపీఎస్‌ ఆర్టీసీలో సమ్మె?

ఏపీఎస్‌ ఆర్టీసీలో సమ్మె అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. వేతన సవరణపై గుర్తింపు కార్మిక సంఘం, యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీలోని 8 కార్మిక సంఘాలు ఏకమై సమ్మెకు సిద్ధమవుతున్నాయి. వారికి అధికారుల సంఘం ఓస్వా కూడా మద్దతు పలకడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఆర్టీసీలో పెద్ద యూనియన్‌ అయిన ఎన్‌ఎంయూతో గుర్తింపు సంఘం సంప్రదింపులు జరుపుతోంది. గతంలో రెండు సంఘాలూ ఏకమై 43% ఫిట్‌మెంట్‌ సాధించుకున్నాయి. అదే అనుభవంతో ఇప్పుడు మరోసారి ఐక్యంగా సమ్మెబాట పట్టాలని ఈయూ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 11వేలకుపైగా బస్సులున్న ఆర్టీసీలో 52 వేల మంది కార్మికులున్నారు. వీరికి 2017 ఏప్రిల్‌ 1న వేతన సవరణ చేయాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో సంస్థ 21 నెలలుగా జాప్యం చేస్తూ వస్తోంది. గత ఏడాది గుర్తింపు సంఘమైన ఎన్‌ఎంయూ ఒత్తిడితో 19% ఫిట్‌మెంట్‌ ఇచ్చిన యాజమాన్యం, ఆ తర్వాత గుర్తింపు సంఘంగా విజయం సాధించిన ఈయూ నేతలతో చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. దీంతో డిసెంబరు 31న ఈయూ సమ్మె నోటీసు ఇచ్చింది. ఆపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యలపై దాదాపు గంటకు పైగా యూనియన్‌ నేతలలో ఎండీ సురేంద్రబాబు చర్చలు జరిపారు. యాభై శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని.. 20 శాతానికి మించి ఇవ్వలేమని ఎండీ తేల్చి చెప్పారని యూనియన్ నేతలు తెలిపారు. అయితే డిమాండ్లను పరిష్కరించే వరకు చేపట్టబోయే సమ్మెను విరమించేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నాయి…ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఇప్పటికీ తాము తక్కువే డిమాండ్‌ చేస్తున్నామని, నష్టాలకు కార్మికులు బాధ్యులు కాకపోయినా న్యాయమైన హక్కులను హరిస్తే ఊరుకోబోమన్నారు ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్‌రావు… సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయని, ఎన్‌ఎంయూతోనూ చర్చలు జరుపుతున్నామని అన్నారు. ఇవాళ జేఏసీ సమావేశం నిర్వహించి సమ్మె తేదిని ప్రకటించనున్నారు. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు. తమది న్యాయమైన డిమాండ్లు అని, వాటిని సాధించుకునే వరకు పోటాటం చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాబోయే బడ్జెట్‌లో ఆర్టీసీకి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos