తొలి పరీక్షలో జగన్‌కు డిస్టింక్షన్

తొలి పరీక్షలో జగన్‌కు డిస్టింక్షన్

(వి. సురేంద్రన్‌)

బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 80 శాతానికి పైగా స్థానాలను చేజిక్కించుకుని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చింది. నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. సోమవారం ఉదయం వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఆయన నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 10,455 పంచాయతీ సర్పంచ్‌ పదవులను గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 2,112 స్థానాలకే పరిమితమైంది. సినీ నటుడు పవన్‌ నాయకత్వంలోని జనసేన పార్టీ కేవలం 323 సర్పంచ్‌ పదవులను సొంతం చేసుకోగలిగింది. బీజేపీ 190 స్థానాలతో తృప్తి పడాల్సి వచ్చింది. ఆ పార్టీ కంటే స్వతంత్రులే అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే.

చంద్రబాబుకు నిరాశ

స్థానిక సంస్థల  ఎన్నికల్లో అధికార పార్టీలు మెజారిటీని సాధించడం మామూలే అయినప్పటికీ, ఈ ఎన్నికలు మాత్రం ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఆ పార్టీకి పెట్టని కోటల్లా ఉన్న పంచాయతీల్లో కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాగా వేసింది. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడుకు కంచుకోటగా భావించే కుప్పంలో ఈసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు విజయ ఢంకా మోగించారు. ఆ నియోజకవర్గంలో మొత్తం 89 పంచాయతీలకు గాను 75 చోట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు భారీ మెజారిటీలతో గెలుపొందడం విశేషం. మొత్తమ్మీద కుప్పం నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 30 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యత లభించింది. 1985 నుంచి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో ఒకటి, రెండు సార్లు మినహా 60 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందుతూ వస్తున్నారు.

బాలకృష్ణకు మింగుడు పడని ఫలితాలు

చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, నటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో గెలుపొందారు. మరో సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌కు ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వంద శాతం పంచాయతీలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో పడ్డాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ చిరునామా గల్లంతైంది.

వెబ్‌సైట్‌లో విజేతల వివరాలు

గ్రామ పంచాయతీల ఎన్నికలు పార్టీ రహితంగా జరగడం ఆనవాయితీ కనుక, గెలిచిన అభ్యర్థులు తమ మద్దతుదారులేనని అన్ని పార్టీలు చంకలు గుద్దుకోవడం మామూలు. పాలనలో వినూత్న శైలిని అవలంబిస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దీనికి భిన్నంగా తమ పార్టీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులు వివరాలు, వారి ఫొటోలను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో తమ పార్టీ మద్దతుదారులు కాని వారు ఎవరైనా ఉంటే చూపండంటూ ఆ పార్టీ సవాలు విసిరింది. ఈ సవాలును తెలుగుదేశం పార్టీ స్వీకరించలేకపోయింది.

సంక్షేమ పథకాలే ఆసరాగా….

ఏడాదిన్నర పాలనలో జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల పట్ల ఓటర్లు ఆకర్షితులైనట్లు ఈ ఎన్నికలు రుజువు చేశాయి. అన్ని రకాల పెన్షన్లు ప్రతి నెలా ఒకటో తేదీ నాటికే లబ్ధిదారుల ఇంటికే చేరేవిధంగా చేసిన ఏర్పాట్లు ప్రజల మనసును దోచుకున్నాయి. దీని కోసం ఆయన ప్రవేశపెట్టిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడింది. రైతు భరోసా, అమ్మ ఒడి లాంటి ఇంకా ఎన్నో పథకాలు ప్రజల మదిలో జగన్‌ స్థానాన్ని సుస్థిరం చేశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos