లక్ష్యాలను చేరుకోని పిఎం-కిసాన్‌

లక్ష్యాలను చేరుకోని పిఎం-కిసాన్‌

న్యూఢిల్లీ : వ్యవసాయ సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. ముఖ్యంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. భూమి లేని రైతులకు ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అంటే 2.4 కోట్ల రైతు కుటుంబాలు ఈ పథకానికి దూరంగా ఉండిపోయాయి. దీనికి తోడు పథకం అమలులో అవినీతి చోటుచేసుకోవడంతో నిధులు వృథా అవుతున్నాయి.
రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఏటా మూడు విడతలుగా మొత్తం ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. పథకం ద్వారా దేశంలో తొమ్మిది కోట్ల మంది రైతులు లబ్ది పొందినప్పటికీ 2022లో జాతీయ సగటు వ్యవసాయ ఆదాయం బిజెపి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో 70 శాతం కంటే తక్కువగానే ఉంది. కేంద్రం ఏటా అందజేస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం కూడా రైతులందరికీ చేరడం లేదు. కేవలం భూమి ఉన్న రైతులకే ఈ సాయం లభిస్తోంది. 2018 డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ పథకాన్ని తొలుత చిన్నకారు, సన్నకారు రైతుల కోసం ఉద్దేశించారు. ఆ తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. 2019 ఫిబ్రవరిలో… అంటే లోక్సభ ఎన్నికలకు ముందు దీనిని మధ్యంతర బడ్జెట్లో చేర్చారు.
తగ్గిపోతున్న లబ్దిదారులు
పథకాన్ని ప్రారంభించి ఐదు సంవత్సరాలు గడిచాయి. ఇప్పటి వరకూ లబ్దిదారులకు 16 విడతలుగా ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. 2021-22 నాటికి పథకంలో 11.2 కోట్ల మంది రైతులు (11వ విడత చెల్లింపుల సమయానికి) చేరారు. అయితే ఆ తర్వాత 12, 13 విడతల ఆర్థిక సాయం అందించే నాటికి లబ్దిదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 14వ విడత చెల్లింపులు జరిపినప్పుడు లబ్దిదారుల సంఖ్య 9.6 కోట్లకు చేరింది. లబ్దిదారుల సంఖ్య ఎందుకు తగ్గుతోందో ప్రభుత్వం వివరణ ఇవ్వడం లేదు. నిబంధనలను కఠినతరం చేయడం, వివిధ రాష్ట్రాలలో అవకతవకలు చోటు చేసుకోవడం దీనికి కారణంగా తెలుస్తోంది. రైతుల పేరుతో కొందరు బయటి వ్యక్తులు ఆర్థిక సాయం పొందారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
గత సంవత్సరం మార్చి నాటికి మూడు కోట్ల మంది మహిళా రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య రెండు కోట్లకు తగ్గిపోయింది. ఫిబ్రవరి నాటికి ఈ పథకం కింద లబ్ది పొందిన రైతుల సంఖ్య 8.71 కోట్లు. ఆర్థిక సాయం పొందడానికి సవాలక్ష నిబంధనలు విధించడంతో పథకంపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. అనేక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి.
భూమి లేని రైతులకు విస్మరించారు
భూమి లేని రైతులను విస్మరించడం ఈ పథకంలో ప్రధాన లోపంగా కన్పిస్తోంది. 2011లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో 5.37 కోట్ల కుటుంబాలకు భూమి లేదు. 2019లో నిర్వహించిన మరో సర్వే ప్రకారం 2.4 కోట్ల రైతు కుటుంబాలు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాయి. 2019లో జరిపిన సర్వేను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 2.4 కోట్ల కుటుంబాలకు పిఎం-కిసాన్ పథకం ప్రయోజనాలు అందడం లేదు.
ఇదేం సాయం?
ఏటా మూడు విడతలుగా అందజేస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం ఏ మూలకూ చాలడం లేదు. రైతన్నల ఆదాయంపై అది ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోంది. రైతు కుటుంబం నెలకు సగటున రూ. 10,218… అంటే ఏడాదికి రూ.1,22,616 ఆదాయం పొందుతోందని 2019లో అంచనా వేశారు. 2022 నాటికి వార్షిక ఆదాయం రూ.1,67,000కు పెరిగి ఉండవచ్చునని అంచనా. మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతు కుటుంబం ఏడాదికి రూ.2,42,998 ఆదాయం పొందాల్సి ఉంది. ఈ వ్యత్యాసాన్ని పూడ్చడానికి ఏటా ఇస్తున్న ఈ ఆరు వేల రూపాయల సాయం ఏ మాత్రం సరిపోదు.
దేశంలోని 76.5 శాతం రైతు కుటుంబాలకు రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమే ఉంది. వీరి సగటు నెలసరి ఆదాయం చాలా తక్కువ. ప్రతి ఏటా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయం రైతన్నల ఇబ్బందులను ఏ మాత్రం తొలగించదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2019లో ఇచ్చిన ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం 2023 నాటికి రూ.4,800తో సమానం. అంటే దీనర్థం రైతుల ఆదాయం 2016 నుండి 2024 నాటికి కూడా రెట్టింపయ్యే అవకాశాలు లేవు.
రాష్ట్రాల బాసట
కొన్ని రాష్ట్రాలు పిఎం-కిసాన్కు అనుబంధంగా పథకాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో రైతుబంధు పథకం ఆ కోవకు చెందినదే. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు భూమి లేని, కౌలు రైతులకు కూడా పథకాలను అమలు చేస్తున్నాయి. జార్ఖండ్, హర్యానా రాష్ట్రాలు నిరుపేద రైతులే లక్ష్యంగా పథకాలు ప్రవేశపెట్టాయి. అనేక రాష్ట్రాలు నేరుగా రైతులకు నగదు బదిలీ చేస్తూ అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos