‘కూ’ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

‘కూ’ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

న్యూఢిల్లీ : ప్రపంచంలో తీవ్రంగా ప్రాచుర్యం పొందిన ట్విట్టర్‌ (ప్రస్తుతం ‘ఎక్స్‌’)కు పోటీగా మోడీ సర్కారు భారతీయ మైక్రోబ్లాగింగ్‌ యాప్‌ ‘కూ’కు తీవ్ర ప్రచారాన్ని కల్పించింది. అయితే, ఇప్పుడు ఆ కూ తన సంస్థలోని ఉద్యోగులకు జీతం చెల్లించలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ ఉద్యోగులందరికీ జీతాల చెల్లింపును నిలిపివేసింది. ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది.2020లో, ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో, చాలా మంది కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు ‘కూ’కు మారారు. తమ అకౌంట్లను సృష్టించుకున్నారు. దీంతో ఈ యాప్‌నకు అప్పట్లో ప్రభుత్వ పరంగానే విపరీత ప్రచారం కలిగింది. ”మేము కూ కోసం వ్యూహాత్మక భాగస్వాములతో చర్చలు జరుపుతున్నాం. ఇది ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. భాగస్వామ్యాన్ని పొందడానికి, మేము గత జీతాలను తీర్చడానికి కూడా గణనీయమైన వ్యక్తిగత నిధులను ఖర్చు చేశాం” అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2022, జూన్‌ నుంచి కంపెనీ తన ఉద్యోగులను 80 శాతం తగ్గించింది. చాలా మంది ఉద్యోగుల జీతాలు 40 శాతం వరకు తగ్గాయని ఒక నివేదిక పేర్కొన్నది. జీతంలో గణనీయమైన కోత తర్వాత ఈ సంవత్సరం ప్రారంభంలో సీనియర్‌ ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టారు. డిజిటల్‌ హక్కుల కార్యకర్త నిఖిల్‌ పహ్వా 2022లో బిబిసితో మాట్లాడుతూ.. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ‘కూ’ని స్వదేశీ, జాతీయవాద దృక్పథంతో ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం ప్రచారం కల్పించింది. దీంతో మైక్రోబ్లాగింగ్‌ యాప్‌నకు ఇది సానుకూలంగా మారింది. ఒక స్థాయిలో అప్పటి ట్విట్టర్‌కు తీవ్ర పోటీనే ఇచ్చింది అని తెలిపారు.నివేదిక ప్రకారం.. కంపెనీ కేవలం రూ. 14 లక్షల నిర్వహణ ఆదాయాన్ని కలిగి ఉన్నది. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.197 కోట్ల నష్టాన్ని చూసింది. కస్టమర్‌ సముపార్జన ప్రచారాలపై అధికంగా ఆధారపడుతున్నది. 2022, జూన్‌లో ఆన్‌బోర్డ్‌ కొత్త వినియోగదారులకు చెల్లింపు ప్రచారాలను నిలిపివేసిన తర్వాత.. దాని వినియోగదారులు 72 లక్షల నుంచి 27 లక్షలకు పడిపోయారని నివేదిక పేర్కొన్నది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos