మల్లయోధుల నిరసనతో దిగివచ్చిన కేంద్రం

మల్లయోధుల నిరసనతో దిగివచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ : మల్లయుద్ధానికి మకిలిపట్టిందంటూ రోడ్డెక్కిన మహిళా రెజ్లర్ల నిరసనకు కేంద్రం దిగివచ్చింది. ఏడాదిపాటు కొనసాగిన వారి ఆందోళనతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారింది. చివరి అస్త్రంగా రెజ్లర్లు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయడంతో కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. కుస్తీ వీరుల జీవితాలతో ఆటలాడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త ప్యానల్పై కేంద్ర క్రీడా శాఖ ఆదివారం వేటు వేసింది. మరోవైపు వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్ తాను ఇక రెజ్లింగ్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. రెజ్లింగ్ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకొన్నది. గత కొంతకాలంగా వార్తల్లో నానుతున్న ఈ అంశంలో కేంద్ర క్రీడా శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల క్రితం కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడా శాఖ విధి విధానాలను అమలు చేయలేదనే కారణంతో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించింది. సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అండర్-15, అండర్-20 జాతీయ పోటీలను ఉత్తరప్రదేశ్లోని గోండాలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రెజ్లర్లు పోటీలకు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వకుండా ప్రకటన వెలువరించిన కారణంగా కొత్త కార్యవర్గంపై వేటు వేసినట్లు క్రీడా శాఖ వెల్లడించింది. రెజ్లింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ కోరింది.
రెజ్లర్ల హర్షం
ఇది రెజ్లర్ల పోరాటానికి దక్కిన విజయమని పలువురు అభివర్ణించారు. నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యమైనా.. రెజ్లర్లకు న్యాయం జరుగుతుందనే ఆశ కలిగింది అని ప్రముఖ రెజ్లర్ గీతా ఫొగట్ పేర్కొనగా.. ఈ పని ముందే చేసి ఉండాల్సింది అని స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
పద్మశ్రీ తిరిగి తీసుకోను: బజరంగ్
డబ్ల్యూఎఫ్ఐలో సమూల ప్రక్షాళన జరగాలని స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా పేర్కొన్నాడు. పద్మశ్రీ అవార్డును తిరిగి తీసుకోనని.. న్యాయం దొరికేంత వరకూ పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నాడు.
రెజ్లింగ్కు దూరంగా ఉంటా: బ్రిజ్భూషణ్
ఇక పై రెజ్లింగ్ వ్యవహారాల్లో తలదూర్చనని.. క్రీడా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వెల్లడించాడు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గమే అన్నీ చూసుకుంటుందని అన్నాడు.

రెజ్లర్ల పోరాటం సాగిందిలా…
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో స్టార్ రెజ్లర్లు ఈ ఏడాది జనవరి 18న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. వారి నిరసనలతో దిగొచ్చిన క్రీడా శాఖ ఫిబ్రవరి నెలలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆధారాలున్నా బ్రిజ్భూషణ్ను అరెస్ట్ చేయలేదని కుస్తీ యోధులు ఏప్రిల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదైంది. మేరీకోమ్ కమిటీ ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన రెజ్లర్లు మే నెలలో మరోసారి ఆందోళన బాట పట్టారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ చేసిన రెజ్లర్లను పోలీసులు ఈడ్చి పారేయడం విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో అసంతృప్తిగా ఉన్న రెజ్లర్లు తమ పతకాలను యమునా నదిలో కలపాలని నిర్ణయించుకున్నారు. అయితే రైతు సంఘాల నేతల జోక్యం ఆ నిర్ణయాన్ని విరమించుకొన్నారు. జూలైలో డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ 21న ఎట్టకేలకు డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు జరిగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos