ఊరి బాట పట్టిన వన్య మృగాలు

ఊరి బాట పట్టిన వన్య మృగాలు

 

ప్రజా వాహిని – బెంగళూరు

అటవి శాఖ అధికార్ల బాధ్యతా రాహిత్యం, విధి నిర్వహణలో వైఫల్యాల వల్ల అడవుల్లో ఉండాల్సిన జంతువులు ఊర్లపై బడుతున్నాయని అరసికెరె శాసనసభ్యుడు శివలింగే గౌడ గురువారం విధానసభలో విమర్శించారు. తమ నియోజక వర్గంలోని అడవుల్లో వన్య మృగాలకు తగిన నీటి వనరులు, మేత లభించక పోవటంతో రాత్రిళ్లు అవి ఊళ్లల్లో పశువుల కోసం కట్టిన నీటి తొట్లలో నీళ్లు తాగుతున్నాయని వివరించారు. బ్రిటిష్‌ కాలంలో అక్కడ వాగుకు కట్టిన చెక్‌ డామ్‌ వల్ల గతంలో వన్య ప్రాణులకు కావాల్సినంత నీరు లభించేది. అది  పాడైపోవటంతో నీటి కొరత ఏర్పడింది. ఎన్నిమార్లు చెక్‌డామ్‌ను కట్టాలని కోరినా అటవి శాఖ అధికార్లు పట్టించుకోవటం లేదని తప్పు బట్టారు. ఇటీవల ఒక యువకుడిపై చిరుత దాడి చేయటం ప్రాణ రక్షణకు దాన్ని ఆ యువకుడు చంపి వేసాడన్నారు.ఇంకా వన్య మృగాలు పెంపుడు జంతువుల్నీ చంపుతున్నాయని అక్రోశించారు. ప్రభుత్వం చెల్లించే పరిహారం విపణిలో వాటి విలువ కంటే చాలా తక్కువగా ఉందని దుయ్య బట్టారు. ఇదే అంశం గురించి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మరి కొందరు ప్రస్తావించారు. త్వరలోనే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికార్లతో సమావేశాన్ని నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని మంత్రి ఉమేశ్‌కత్తి బదులిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos