‘పుస్తకాన్ని నిషేధించడం ఎందుకు…చదవడం మానేయండి’

‘పుస్తకాన్ని నిషేధించడం ఎందుకు…చదవడం మానేయండి’

న్యూఢిల్లీ: కాంగ్రస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన తాజా పుస్తకంపై వివాదం నెలకొనడం తెలిసిందే. ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ డిమాండ్లు కూడా వస్తున్నాయి.  ఇదే విషయమై కోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తికి కోర్టు నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ‘మీ మనోభావాలు అంతగా దెబ్బతింటే ఆ పుస్తకం చదవకండి. వేరే ఇంకేదైనా పుస్తకం చదవండి’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.
సల్మాన్ ఖుర్షీద్ రాసిన ‘సన్‌రైస్‌ ఓవర్ అయోధ్య: నేషనల్‌హుడ్‌ ఇన్ అవర్ టైమ్స్’ అనే పుస్తకంలో హిందుత్వ ఉగ్రవాదం గురించి ప్రస్తావించారు. బాబ్రీ కూల్చివేత సమయంలో హిందుత్వ ఉగ్రవాదం జిహాదీ, ఐసిస్, బొకొ హారమ్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు ఏమాత్రం తీసిపోనంతగా ప్రవర్తించిందని అన్నారు. కాగా, హిందూ ధర్మాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యానించారంటూ బీజేపీ సహా రైట్ వింగ్‌కు చెందిన వారు విమర్శలు గుప్పించారు.
ఇదే విషయమై ఢిల్లీ హైకోర్టును ఓ వ్యక్తి ఆశ్రయించాడు. పుస్తకాన్ని నిషేధించాలని పిటిషన్ దాఖలు చేశాడు. ‘‘భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇష్టారీతిన వ్యాఖ్యానించకూడదు. అలాంటి అధికారం ఏ ఒక్క వ్యక్తికీ లేదు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరిస్తూ ‘‘ఒక వేళ ఈ పుస్తకంలో నిన్ను ఇబ్బంది పెట్టే, నీ మనోభావాల్ని దెబ్బతిసే వ్యాఖ్యలు ఏమైనా ఉంటే అది చదవడం మానేయండి. ఈ పుస్తకం చదవద్దని ప్రజలకు తెలియజేయండి. ఈ పుస్తకానికి బదులు ఇంకేదైనా పుస్తకం చదవండి’’ అని వ్యాఖ్యానించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos