మా ఊరికి రావద్దండోచ్…

మా ఊరికి రావద్దండోచ్…

హొసూరు : ఏ తంటా తగాదాలు లేవు. భూ వివాదాలు అసలే లేవు. కనుక మా గ్రామానికి రావద్దంటూ రోడ్లపై ముళ్లకంచెలు వేస్తున్న దౌర్భాగ్యం నేడు గ్రామాలలో నెలకొంది. ఒకప్పుడు పల్లెటూళ్లు అందరినీ అక్కున చేర్చుకుని ఆదరించేవి. గ్రామంలోకి కొత్తవారొస్తే భోజనం తినందే, కాలు కదలనిచ్చేవారు కారు. కరోనా మహమ్మారి వల్ల గ్రామాలలో అలాంటి ఆప్యాయతలు, అనురాగాలు దూరమయ్యాయి. మా గ్రామాలకు రావద్దంటూ పొలిమేర్లలో ముళ్లకంచెలు వేస్తున్నారు. కరోనా ఇండియానే కాదు ప్రపంచాన్నే గడగడలాడిస్తుండగా, అన్ని రాష్ట్రాల మాదిరే తమిళనాడు ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమై కాలం గడుపుతున్నారు. బయటకు వెళితే కరోనా వైరస్ కబళిస్తుందేమోనని భయపడి రైతులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇతరులు గ్రామాల్లోకి వచ్చి కరోనాను అంటిస్తారేమోననే భయంతో సూలగిరి సమీపంలోని గంగసంద్రం గ్రామవాసులు అప్రమత్తమయ్యారు. తమ గ్రామానికి ఎవరు రాకూడదని ఊరిలోకి ప్రవేశించ రోడ్డుకు ముళ్ళ కంచె వేసి దిగ్బంధించారు. తమ గ్రామంలోకి ఎవరినీ అనుమతించబోమని తేల్చి చెప్పారు. బంధువులను కూడా గ్రామంలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఖరాకండిగా చెబుతున్నారు. ఏప్రిల్ 14 వరకు తమ గ్రామంలోకి ఎవరినీ అనుమతించబోమని తెగేసి చెప్పడంతో పరిసర గ్రామస్థులు అవాక్కయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos