జగన్ అడుగు జాడల్లో వల్లభనేని వంశీ

జగన్ అడుగు జాడల్లో వల్లభనేని వంశీ

విజయవాడ: నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వానికి మద్దతిస్తానని, ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి నడుస్తానని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన వంశీ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, వైకాపాకు ఎందుకు మద్దతివ్వాల్సి వచ్చిందో వివరించారు. ‘ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. అప్పుడే దీక్షలు, ఉద్యమాలు అని ఎంతో అపార అనుభవమున్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా సమర్థంగా పోషించలేక పోతున్నారు. అకాల వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నదిలో ఇసుకను తీయగలమా? ఏ ప్రభుత్వం ఉన్నా మంచి పనిచేస్తే సమర్థించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెబుతామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. డబ్బున్న వారికి ఒక న్యాయం.. పేదవారికి ఒక న్యాయమా? తెలుగు భాషను కాపాడే బాధ్యత పేదవారిపై మాత్రమే ఉందా? డబ్బున్నవారిపై లేదా?ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా. 2014 ఎన్నికలకు ముందు తెదేపా ప్రతిపక్షంలోఉన్నప్పుడు రైతు రుణ మాఫీ చేస్తామని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశాం. రైతు రుణమాఫీని ఎంతకాలం తర్వాత మొదలుపెట్టామో, ఎన్ని దశల్లో అమలు చేశామో అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. అధికారం పోయిందని వెంపర్లాడితే ప్రజలు చీత్కరించుకుంటారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెదేపా తరఫున ప్రచారం చేశారు. ఆతర్వాత మళ్లీ ఎప్పుడైనా కనిపించారా?కారణమేంటి. ఆయన్ని ఎవరు ఆపేశారు. పదేళ్ల క్రితం కెరీర్‌ను పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పదేళ్లు ఎందుకు కనిపించలేదు?2014లో భాజపా, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. మూడేళ్లున్నాం. ఆ తర్వాత ధర్మ పోరాట దీక్షలని దిగాం. కేంద్ర ప్రభుత్వం చేయగలిగినంత చేస్తోందని, ఈ దీక్షలు వద్దని సుజనాచౌదరి లాంటి వాళ్లు చెప్పినా వినలేదు. ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిందా?ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చేంత బలం లేకుండా ఎందుకు పోయింది? ఇలాంటి విపరీత విధానాల వల్లే కదా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక రకంగా, తెలంగాణలో మరో రకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో పవన్ ఎందుకు ప్రశ్నించడంలేదు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో ఎందుకు పాల్గొనడంలేదు. ఓటుకు నోటు కేసు ఉందని భయమా? ఇలాగే వ్యవహరిస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. జగన్‌కు మద్దతిస్తే నాకు వ్యక్తిగతంగా లాభం లేదు. ఇలాంటి కేసులు గతంలోనే చూశాను.. అధికారంలో ఉన్నప్పుడు కూడా నాపై కేసులు పెట్టారు. కేసులకు భయపడే వ్యక్తిని కాదు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అయినా ఈ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా. 1995 నుంచి జగన్‌తో నాకు పరిచయముంది. గతంలో సాయం చేసినా.. అయన జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్లి పరామర్శించలేదు. తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పనిచేశా’ అని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos