బెంగళూరులోనూ శ్రీ వారి కళ్యాణ కట్ట

బెంగళూరులోనూ శ్రీ వారి కళ్యాణ కట్ట

బెంగళూరు: వెంకన్న భక్తులకు శుభ వార్త. మొక్కు తీర్చుకునేందుకు తలనీలాల సమర్పణకు తిరుమలకే వెళ్లనక్కర లేదు. ఇక్కడి వయ్యాలి కావాల్ ఆలయంలోనూ కళ్యాణ కట్ట నిర్మించనున్నారు. ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో ఇది సేవలకు సిద్దం కానుందని ఆలయ స్థానిక సలహా మండలి అధ్యక్షుడు డాక్టర్ సంపత్ రవి నారాయణన్ వెల్లడించారు. శనివారం ఇక్కడ ఆయన మండలి ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ అడిగ, కార్యదర్శి భక్తవత్సల రెడ్డితో కలసి విలేఖరులతో మాట్లాడారు. ఇంకా ఇదే ఆలయంలో చిరు పుష్కరణి , అమ్మవారి ఆలయాల్ని కూడా కట్టనున్నామని చెప్పారు. ఇందుకు రూ రెండు కోట్లు వ్యయం కాగలదని అంచనా వేసామన్నారు. బెంగళూరు ఈశాన్య ప్రాంతంలో ఒక చోట తిరుమల శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాల రీతిలో గుళ్లు, వేద, ఆగమ పాఠశాలల్ని రూ. మూడు వందల కోట్ల అంచనా వ్యయంతో కట్టనున్నట్లు కూడా చెప్పారు. స్థలాన్ని ఇంకా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. అన్ని నిర్మాణాలకు కావాల్సిన నిధుల్ని విరాళంగా ఇచ్చేందుకు భక్తులు చాలా మంది ముందుకు వచ్చారని, తి.తి.దే కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తుందని వివరించారు. వయ్యాలి కావల్ ఆలయంలో కళ్యాణ కట్ట నిర్మాణానికి ఆగమ శాస్త్ర పండితులు అంగీకరించారని సంపత్ రవి నారాయణన్ ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. వచ్చే సోమవారం నుంచి బుధవారం వరకూ మూడు రోజుల పాటు ఇక్కడి ఆలయంలో స్వామి వారికి మహా సంప్రోక్షణ నిర్వహించ నున్నట్లు తెలిపారు. మంగళ వారం మధ్యాహ్నం వరకు మాత్రమే స్వామి వారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. బుధవారం సాయంత్రం కళ్యాణోత్సవాన్ని జరుపుతామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos