ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో ఏఎస్రావుపై చిత్రించిన ‘మహామనిషి ఏఎస్రావు’ టెలిఫిలిమ్ను ఈసీఐఎల్ ఎమ్డీ, చైర్మెన్ అనురాగ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం చిత్రాన్ని ప్రదర్శించారు. అంతకుముందు బీవీ రాఘవులు మాట్లాడుతూ..విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన ఏఎస్రావు అక్కడ ఎన్నో అవకాశాలున్నప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ను ప్రపంచ దేశాల ముందు సూపర్ పవర్గా నిలపాలనే ధృడ సంకల్పంతో స్వదేశానికి తిరిగొచ్చారని కొనియాడారు. సొంత ఆస్తులు కూడబెట్టుకోకుండా ఎలక్ట్రికల్ రంగంలో ఒక బ్రాండ్ ఇమేజ్ను ఈసీఐఎల్ ద్వారా సృష్టించారని ప్రశంసించారు. కానీ, మన దేశంలో నేటి పాలకులు ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను మింగేస్తున్నారని చెబుతూ.. ఐడీపీఎల్తోపాటు పలు సంస్థల స్థితిగతులను ప్రస్తావించారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉండటం వల్లనే ఇప్పటివరకూ ఈసీఐఎల్ సంస్థ ఉండగలిగిందనీ, లేకపోతే దాన్ని కూడా ఎప్పుడో స్వాహా చేసేవారని చెప్పారు. దేశ ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలను తయారు చేసిన ఘనత కూడా ఈసీఐఎల్దేనని గుర్తు చేశారు. రాజకీయ నేతలు తాము గెలిస్తే ఈవీఎంల గురించి మాట్లాడటం లేదనీ, ఓడిపోతే మాత్రం ట్యాపరింగ్, హ్యాకింగ్ అంటూ దాట వేస్తున్నారని చెప్పారు. రాజకీయాలను సైన్సు శాసించేస్థాయి మన దేశంలో పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయాలే సైన్సును నిర్ణయించే స్థితికి వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. అశాస్త్రీయ భావజాలం వేగంగా వ్యాప్తి చెందుతోందనీ, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం సమాజం ముందుందని నొక్కి చెప్పారు. మూఢ నమ్మ కాలను తాటికాయంత అక్షరాలతో ప్రచారం చేసిన బాబారాందేవ్ను అంతే సైజు అడ్వర్టయిజ్మెంట్తో దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ సుప్రీం కోర్టు ఆదేశిం చటాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అనురాగ్ కుమార్ మాట్లాడుతూ..తన ముందు ఎన్నో మంచి అవకాశాలున్నా వాటన్నింటినీ వదులుకుని దేశం కోసం పరితపించిన మహోన్నతుడు ఏఎస్రావు అని కొనియాడారు. దేశం ఎలక్ట్రానిక్ రంగంలో ఈ స్థాయికి ఎదగడానికి వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉందన్నారు. నేడు సంస్థల అధిపతుల్లో దేశభక్తి తరిగిపోయి కోశభక్తి పెరిగిందన్నారు. హైదరాబాద్ అంటే సైబర్సిటీ, రియల్ ఎస్టేట్గా మాత్రమే చూడొద్దనీ, ఎన్నికలకు అవసరమైన సామగ్రిని తయారు చేసిన, టీవీని అందించిన ఈసీఐఎల్ ఉందనే విషయాన్ని మరువొద్దని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీతో ఒరిజినల్ ఇంటలిజెన్సీపై ఎఫెక్ట్ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్కు మానవత్వాన్ని అద్దేలా చూడాలని కోరారు. ప్రస్తుతం వస్తున్న కొన్ని బయోపిక్లు భయంగొల్పేలా, చరిత్రను వక్రీకరించేలా ఉంటున్నాయని వాపోయారు. వాటిని ఫక్తు రాజకీయ, మార్కెట్ కోణంలో తీసుకురావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు టి.రమేశ్ మాట్లాడుతూ…104 ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్లను నిర్వీరామంగా నిర్వహించిన మనదేశంలో ఈ ఏడాది ఆ కార్యక్రమాన్ని ఆపేసిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సూడో సైన్స్ ప్రచారానికి నిధులు మళ్లించడమే దీనికి కారణమని తెలిపారు. అణురియాక్టర్కు అవసరమైన పరికరాలను తయారు చేసే శాస్త్ర సాంకేతిక స్వావలంబనను సాధించడంలో ఏఎస్రావు కృషి మరువలేని దన్నారు. దాశరథి ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ..మహామనిషి ఏఎస్రావు టెలిఫిలిమ్ చిత్ర నిర్మాణంలో తమ సొసైటీ కీలక పాత్ర పోషించిందన్నారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల పదిన ఆ ఫిలిమ్ను ప్రదర్శిస్తామని, ఐదో తేదీన భగత్సింగ్పై నిర్మించిన ఫిలిమ్ను ప్రదర్శిస్తామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos