తీర్థహళ్లి చుట్టూ 11 అద్భుతాలు..

తీర్థహళ్లి చుట్టూ 11 అద్భుతాలు..

కర్ణాటక పర్యాటక సిగలో అలరారే శివమొగ్గ జిల్లాలో విహారయాత్ర అంటే కొద్ది రోజుల పాటు ప్రపంచాన్ని మరచిపోవడమే.శివమొగ్గ జిల్లాలో స్విట్జర్లాండ్‌ను మించిన ప్రకృతి రమణీయ దృశ్యాలు,పచ్చదనంతో తులతూగుతున్న తీర్థహళ్లి జిల్లా పర్యాటకానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది.తీర్థహళ్లితో పాటు తీర్థహళ్లి చుట్టూ ఉన్న 11 ప్రాంతాలు తమ అందాలు,రహస్యాలతో బాహ్యప్రపంచం జ్ఞాపకాలను కూడా దగ్గరికి చేరనివ్వవు.తీర్థహళ్లి స్థలచరిత్ర గురించి పరిశీలిస్తే జిల్లాలో ప్రవహించే తుంగ నది పేరుతో తీర్థహళ్లికి పేరు వచ్చినట్లు తెలుస్తోంది.తుంగానది ఒడ్డున ఉన్న తీర్థహళ్లిని పరశురామతీర్థ లేదా రామతీర్థగా కూడా పిలుస్తుంటారు.దట్టమైన పచ్చనైనా పశ్చిమ కనుమల్లో తుంగా నది ఒడ్డున ప్రకృతి ఒడిలో సేద తీరాలన్నా,భారతీయ వారసత్వాన్ని,గ్రామీణ,అటవీ సంస్కృతిని చూడాలన్నా తీర్థహళ్లి వెళ్లాల్సిందే.తీర్థహళ్లి పర్యటనలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం పదండి..
శ్రీరామేశ్వర ఆలయం..
తుంగా నది ఒడ్డున ఉన్న అతిపురాతన ఆలయమైన శ్రీరామేశ్వర ఆలయం తప్పకుండా చూడాల్సిందే.ఆలయంలో శివలింగాన్ని పరశురాముడు స్వయంగా ప్రతిష్టించినట్లు స్థానిక చరిత్ర.ఆధ్యాత్మికత,ప్రకృతి ప్రశాంతత మధ్య నదీ తీరాన నెలకొన్న రామేశ్వర ఆలయంలో ధ్యానం అద్వితీయమైన అనుభవం..

రామేశ్వర ఆలయం..


ఆనందగిరి కొండ..
తీర్థహళ్లి నుంచి షిమోగాకు వెళ్లే రహదారిలో ప్రకృతిని కుప్పగా పోసినట్లు కనిపించే ఆనందగిరి కొండ నిజంగానే ప్రకృతి అందాల కుప్ప.300 అడుగుల ఎత్తుతో ఉన్న ఆనందగిరి కొండలపై ట్రెక్కింగ్‌ ఎటువంటి వారికైనా పునరుత్తేజాన్ని కలిగిస్తుంది.ఏడాది పొడవునా ఆనందిగిరి కొండలు ట్రెక్కింగ్‌కు అనువుగానే ఉంటాయి.అయితే వర్షకాలంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి..

ఆనందగిరి కొండలు..


సిద్దేశ్వరగుడ్డ..
ఆనందగిరి కొండల నుంచి ఆగుంబె రహదారిపై కేవలం పది నిమిషాలు ప్రయాణం చేస్తే కనిపించే సిద్దేశ్వరగుడ్డ కూడా ట్రెక్కింగ్‌కు చాలా అనువైన ప్రదేశం.200 అడుగుల ఎత్తున్న సిద్దేశ్వరగుడ్డపై ట్రెక్కింగ్‌ చేసి చేరుకోవడం ఒక ఎత్తైతే కొండపై భాగం నుంచి ఎటుచూసినా కనిపించే దట్టమైన పశ్చిమ కనుమల అడవుల అందాలు,అక్కడక్కడా కనిపించే గ్రామాలు,ఇళ్లులు మరింత కనువిందు చేస్తాయి.చిరపుంజి అనంతరం ఏడాది పొడవునా వర్షం కురిసే ప్రాంతంగా ప్రసిద్ది చెందిన ఆగుంబెలో చిరుజల్లుల మధ్య కొండలపై ట్రెక్కింగ్‌ ఎంతో ఆహ్లాదంగా,సరదాగా ఉంటుంది.ఈ కొండపై నుంచి కొడచాద్రి తదితర ఎత్తైన శిఖరాలు సైతం చూడొచ్చు. ఎల్లప్పుడూ చిత్తడిగా ఉండడంతో కొండలపై ట్రెక్కింగ్‌ సమయంలో మట్టిపెళ్లలు విరిగే అవకాశం ఉండడంతో పాటు విషపూరితమైన నల్లత్రాచులకు నిలయం కావడంతో ట్రెక్కింగ్‌ సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి..

సిద్దేశ్వరగుడ్డ..


కూడ్లి..
దక్షిణభారతదేశంలోని పవిత్రమైన,ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కూడ్లి కూడా ఒకటి.తుంగ,భద్ర నగుల సంగమం తీరాన వెలసిన కూడ్లి అత్యంత పురాతన ఆలయాలకు నిలయంగా విరాజిల్లుతూ దక్షిణ వారణాసిగా గుర్తింపు కలిగిఉంది.షిమోగా జిల్లా కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడ్లిలో రామేశ్వర,నరసింహా,బ్రహ్మేశ్వర,రుష్యశ్రమ తదితర అనేక పురాతన ఆలయాలు ఉండడంతో కూడ్లికి దక్షిణ వారణాసిగా గుర్తింపు వచ్చింది.హిందూ తత్వశాస్త్రంలో రెండు గొప్ప తాత్విక పాఠశాలలైన శంకరాచార్య మఠం,కూడ్లి ఆర్య అక్షోభ్య తీర్థ మఠం ఇక్కడే ఉన్నాయి..

కూడ్లిలో పురాతన ఆలయం..


తుంగా వంతెన..
తుంగ నదిపై నిర్మించిన తుంగా వంతెన తీర్థహళ్లి పర్యటనలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన సర్‌.ఎం.విశ్వేశ్వరయ్య నేతృత్వంలో తుంగా నదిపై నిర్మించిన ఈ వంతెనను జయచామరాజేంద్ర ఒడయార్‌ వంతెనగా కూడా పిలుస్తుంటారు.నదికి ఇరువైపులా స్తంబాలు ఏర్పాటు చేసి వాటిపై భాగంలో విల్లులా నిర్మించిన ఈ వంతెన ఇప్పటికీ చెక్కుచెదరకుండా సర్‌.ఎం.విశ్వేశ్వరయ్య ప్రతిభను తెలియజేస్తోంది.1943లో పూర్తయిన ఈ వంతెన నిర్మాణ పనులను మైసూరు మహారజు దివంగత జయచామరాజేంద్ర ఒడయార్‌ ప్రారంభించి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించడంతో ఈ వంతెనకు జయచామరాజేంద్ర ఒడయార్‌ వంతెనగా నామకరణం చేశారు..

తుంగా వంతెన..


కావలెదుర్గ..
తీర్థహళ్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనున్న కావలెదుర్గ పర్యాటకంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ప్రసిద్ధి చెందింది.తొమ్మిదో శతాబ్దంలో కెలాడి రాజులు కావలెదుర్గపై నిర్మించిన కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండి నాటి రాజుల వైభవం,పాలనను కళ్లకు కట్టినట్లు తెలియజేస్తోంది.వరాహి నది పరవళ్లు,ప్రకృతి అందాల మధ్య కావలెదుర్గకు ట్రెక్కింగ్‌ చేయడం వర్ణించలేని అనుభూతి.కావలెదుర్గ కోట ఆవరణలో ఉన్న నీటి కొలను ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నీటితో పర్యాటకలను ఆకర్షిస్తుంటుంది..

కావలెదుర్గ కోట..

కావలెదుర్గలో నీటి కొలను..

కావలెదుర్గలో నీటి కొలను..


మందగడ్డె పక్షుల అభయారణ్యం..
తీర్థహళ్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనున్న మందగడ్డె పక్షుల అభయారణ్యం తప్పకుండా చూడాల్సిందే.తుంగ నది మధ్యలో సుమారు 1.15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన పక్షుల అభయారణ్యంలో విహారం పక్షుల లోకంలో విహరించినట్లుగా ఉంటుంది.జులై నుంచి అక్టోబర్‌ వరకు సుమారు ఐదు వేలకు పైగా పలు జాతుల పక్షులు సంతానోత్పత్తికి మందగడ్డె పక్షుల అభయారణ్యానికి వస్తుంటాయి.ఈ ద్వీపంలో మైడాన్‌ ఈగ్రెట్‌,పీయ్డ్‌ కింగ్‌ఫిషర్‌,వూలీ నెక్‌ స్టాక్‌,నైట్‌ హెరాన్స్‌,ఓపెన్‌ బిల్డ్‌ స్టోర్క్స్‌ తదితర పలు జాతుల పక్షులతో పాటు డార్టర్‌,ఎగ్రెట్‌,కార్మరెంట్‌ తదితర వలస పక్షులు సందడి చేస్తుంటాయి..

మైడాన్‌ ఈగ్రెట్‌ పక్షులు..


తవరేకొప్ప టైగర్‌,లయన్‌ సఫారీ..
తీర్థహళ్లి నుంచి పది కిలోమీటర్ల దూరంలో చాలా దట్టమైన అడవిలో సుమారు 200కు పైగా హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న తవరేకొప్ప టైగర్‌,లయన్‌ సఫారీ పెద్దపులులు,సింహాలకు అభయారణ్యంగా,సంరక్షణ కేంద్రంగా విరాజిల్లుతోంది.ఎన్నో అరుదైన వృక్షజాతులు,దట్టమైన అడవిలో అడవికి రారాజులైన సింహాలు,పులులను అతి సమీపం నుంచి చూడడడం వర్ణించలేని అనుభవం.వీటితో పాటు పలు రకాల నెమళ్లు,ఫీసెంట్‌,అడవికోడి తదితర 11 రకాల పక్షుల జాతులను కూడా చూడొచ్చు..

తవరేకొప్ప టైగర్‌,లయన్‌ సఫారీలో పులుల సంచారం..


నాగరకోట..
తీర్థహళ్లి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో కొండపై ఏర్పాటు చేసిన నాగరకోట సరస్సు పచ్చటి ప్రకృతి రమణీయ దృశ్యాలతో కనువిందు చేస్తూ మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది.నాగరకోటలో అప్పట్లోనే నేటి కాలాకానికి తగ్గట్లు ఏర్పాటు చేసిన నీటి సరఫరా వ్యవస్థ ఆశ్చర్యపరుస్తుంది.దీంతోపాటు కోటలోని దర్బార్‌హాల్‌,ఫిరంగులు,అక్కాతంగి కోలాగా పిలుచుకునే నీటి కొలనులు మరింత ముచ్చటగొలుపుతాయి.కోట నుంచి అలాకొద్ది దూరం అడవిలో ప్రయాణిస్తే అందమైన జలపాతాలు,ఆధ్యాత్మిక పంచే ఆలయాలు మనసుకు ఆహ్లాదం పంచుతాయి..

నాగరకోట..


చిబ్బలగుడ్డె..
తీర్థహళ్లి నుంచి కేవలం తొమ్మది కిలోమీటర్ల దూరంలో తుంగ నదీ తీరాన ఉన్న చిబ్బలగుడ్డె ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.ప్రత్యేకత పరిస్థితుల కారణంగా ఇక్కడ నదీ తీరం చాలా మృదువుగా ఉంటుంది.దీంతోపాటు పలు రకాల జలపుష్పాలకు సైతం చిబ్బలగుడ్డె చిరునామాగా విరాజిల్లుతోంది.ఇరువైపులా దట్టమైన పశ్చిమ కనుమల అడవులు మధ్యలో స్వచ్ఛమైన తుంగ నది ప్రవాహం అందులో జలపుష్పాల సందడి చూడడానికి రెండు కళ్లు చాలవు..

చిబ్బలగుడ్డెలో జలపుష్పాలతో అమ్మాయిలు..


గాజనూర్‌ ఆనకట్ట..
తీర్థహళ్లి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో తుంగా నదిపై నిర్మించిన గాజనూర్‌ ఆనకట్ట కూడా ప్రముఖ పర్యాటక ప్రదేశమే.వర్షాకాలంలో ఆనకట్ట గేట్లు తెరిచిన సమయంలో ఆనకట్ట నుంచి పరవళ్లు తొక్కుతూ తుంగ నది అందాలు చూడడం వర్ణణాతీతం.దీంతపాటు ఇక్కడికి సమీపంలో ఏనుగుల శిక్షణ శిబిరం కూడా తప్పకుండా చూడాల్సిందే..

గాజనూరు ఆనకట్ట..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos