ఈరోజు కూడా సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు

ఈరోజు కూడా సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు

అమరావతి: అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు – బుధవారం ప్రారంభమైన వెంటనే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పట్టింది. తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఆక్వా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం అని నినదించారు. పంట బీమా, ఇన్ పుట్ సబ్సిడీని మర్చిపోయిన ప్రభుత్వం అని నినాదాలు చేశారు. దగా ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలి అని నినదించారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ వారిస్తున్నా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో, ఈరోజుకి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే, సభ నుంచి వెళ్లేందుకు వారు నిరాకరించడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. టీడీపీ సభ్యులను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ గందరగోళ పరిస్థితిలోనే స్పీకర్ జీరో అవర్ ను ప్రారంభించారు.సస్పెండ్ అయిన టీడీపీ సభ్యుల్లో బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, బెందళం అశోక్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, రామరాజు, డోలా బాలవీరాంజనేయస్వామి, వెంకటరెడ్డి నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. టీడీపీ సభ్యులు నిన్న కూడా సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos