కేజ్రీవాల్ కోర్టులోనే నిజాలు వెల్లడిస్తారు

కేజ్రీవాల్ కోర్టులోనే నిజాలు వెల్లడిస్తారు

న్యూ ఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కాం పేరుతో కేంద్రం ఆడుతున్న నాటకానికి గురు వారం కోర్టులోనే తెరదించుతానని కేజ్రీవాల్ తనకు చెప్పారని సునీత కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలను దేశ ప్రజలకు కోర్టు ద్వారా వెల్లడిస్తారని వివరించారు. మీడియాకు విడుదల చేసిన సందేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య, మాజీ ఐఆర్ఎస్ అధికారి సునీత కేజ్రీవాల్ తెలిపారు. రెండేళ్లుగా ఆప్ నేతల ఇళ్లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చాలాసార్లు దాడులు చేశారని, దాదాపు 250 సార్లకు పైగా తమ ఇళ్లల్లో సోదాలు చేశారని గుర్తుచేశారు. వందల కోట్ల స్కాం అని ఆరోపించిన అధికారులు ఇన్ని సోదాలు జరిపినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా గుర్తించలేదని అన్నారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని చెప్పేందుకు ఇంతకన్నా ఆధారం ఇంకేం కావాలని సునీత ప్రశ్నించారు.సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలను వేధించాలని చూస్తున్నారా అంటూ కేంద్రంలోని బీజేపీ పెద్దలను సునీత నిలదీశారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజలకు ఎలాంటి కష్టం కలగొద్దని కేజ్రీవాల్ భావిస్తున్నారు, తపన పడుతున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం నీటి సమస్యపై మంత్రి ఆతీశికి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసిన విషయం సునీత గుర్తుచేశారు. తన కష్టాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల కోసమే ఆలోచించే నేతను జైలుకు పంపించి ఏం సాధించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి గురువారం కోర్టులో అన్ని నిజాలను వెల్లడిస్తానని కేజ్రీవాల్ తనతో చెప్పారన్నారు. అంతేకాదు, కేజ్రీవాల్ శరీరం మాత్రమే కస్టడీలో ఉందని, ఆయన ఆత్మ ఢిల్లీ ప్రజలకు తోడుగా వెన్నంటే ఉందని చెప్పారని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos