రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్

జైపూర్‌ : రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా అజింక్య రహానే స్థానంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను నియమించారు. తద్వారా ఐపీఎల్‌లో కోలుకోలేని దెబ్బలు తింటున్న ఆర్‌ఆర్‌కు కాస్త ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ఏడాది పాటు నిషేధానికి గురైన స్మిత్‌ ఆ గడువు ముగియడంతో ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఇంతకు ముందు ఆర్‌ఆర్‌కు అతనే కెప్టెన్‌గా వ్యవహరించేవాడు. ముంబై ఇండియన్స్‌తో ఇక్కడ ఆర్‌ఆర్‌ తలపడనున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఆర్‌ఆర్‌ ఇప్పటికే ఎనిమిదింటికి గాను ఆరు మ్యాచుల్లో పరాజయం పాలైంది. మరో ఆరు మ్యాచులు ఆడాల్సి ఉండగా, కనీసం అయిదింటిలో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్‌కు అర్హత లభించే అవకాశం ఉంది. గత ఏడాది ఐపీఎల్‌సీజన్‌లో ఆర్‌ఆర్‌ కెప్టెన్‌గా స్మిత్‌ వ్యవహరించాడు. మధ్యలో బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా తప్పుకోవడంతో రహానే ఆ బాధ్యతలను స్వీకరించాడు. ‘ఐపీఎల్‌లో ఇక జరగబోయే మ్యాచులకు స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం వహిస్తాడు. గత ఐపీఎల్‌లో రహానే జట్టును ప్లేఆఫ్స్‌ వరకు తీసుకెళ్లడానికి గట్టిగా కృషి చేశాడు. ఈ ఏడాది జట్టు మళ్లీ పుంజుకోవడానికి తాజా నిర్ణయం తీసుకోవాలని ఫ్రాంచైసీ నిర్ణయించింది` అని జట్టు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా స్మిత్‌ మే ఒకటో తేది వరకు అందుబాటులో ఉంటాడు. అప్పటికి జట్టు అత్యధిక మ్యాచులను ఆడేసి ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos