వామపక్ష విద్యార్థుల విజయం మనువాదులకు చెంపపెట్టు

వామపక్ష విద్యార్థుల విజయం మనువాదులకు చెంపపెట్టు

హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ)లో వామపక్ష విద్యార్థుల విజయం మనువాదులకు చెంపపెట్టు లాంటిదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో మతోన్మాద ఏబీవీపీని ఓడించి వామపక్ష విద్యార్థి సంఘాలను గెలిపించిన ఆ వర్సిటీ విద్యార్ధులకు జేజేలు తెలిపింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతున్నదనీ, కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా అమెరికా, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేస్తున్నదని విమర్శించారు. నూతన విద్యావిధానం-2020ని తెచ్చి విద్యారంగంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఒకే గొడుగు కిందకు తేవాలనే పేరుతో సీయూఈటీని తెచ్చిందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ఎన్టీఏను ఏర్పాటు చేసి ఫీజులు దండుకుంటున్నదని విమర్శించారు. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని నాశనం చేస్తూ కావాలనే నిధులు కేటాయించకుండా ఫీజులను భారీగా పెంచి ఇప్పడిప్పుడే కింది వర్గాల నుంచి ఉన్నత చదువుల కోసం వర్సిటీలకు వస్తున్న విద్యార్థులపై భారాలను మోపుతున్నదని తెలిపారు.వారిని ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర దాగి ఉన్నదని పేర్కొన్నారు. జేఎన్యూలో మతోన్మాదులను ఎలాగైనా గెలిపించేందుకు ఏబీవీపీకి అనుకూలంగా జేఎన్యూ వర్సిటీ పరిపాలనా విభాగం పనిచేసిందని విమర్శించారు. అందులో భాగంగానే లెఫ్ట్ కూటమి ప్రధాన కార్యదర్శి అభ్యర్థిని పోలింగ్కు రెండురోజుల ముందు అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. వర్సిటీలోకి ఆర్ఎస్ఎస్ వ్యక్తులు, బీజేవైఎంకు చెందిన వ్యక్తులు ప్రవేశించి విద్యార్థులపై దాడులు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు డబ్బు, ఇతర ప్రలోభాలకు గురి చేశారని వివరించారు. అయినా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే భాధ్యత విశ్వవిద్యాలయ విద్యార్థులు తీసుకున్నారని తెలిపారు.అందుకే వామపక్ష విద్యార్థి సంఘాలను విద్యార్థులు గెలిపించారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాలనీ, దేశంలో ప్రజాస్వామ్యం, విద్వేషాలు, విభజనలు లేని, స్వేచ్ఛ కోసం పోరాడాలని విద్యార్థి లోకానికి వారు పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos