కేంద్రం తీరుపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలి కాలంలో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలకు తీవ్ర విఘాతం కలుగుతోందని దుయ్యబట్టింది. తప్పించుకునేవిధంగా అఫిడవిట్ దాఖలు చేశారని పేర్కొంది. తబ్లిగి జమాత్ సమావేశాలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం జామియా ఉలేమా ఈ హింద్, తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభంలో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశాలపై కొన్ని మీడియా సంస్థలు మతపరమైన విద్వేషాన్ని వ్యాపింపజేసినట్లు పిటిషనర్లు ఆరోపించారు. ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ తప్పించుకునే విధంగా, అస్పష్టంగా, నిస్సిగ్గుగా ఉందని అత్యన్నత న్యాయస్థానం మండిపడింది.
జమాత్ తరపున సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ గురించి ప్రస్తావించారు. పిటిషనర్లు వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ‘‘వారి (ప్రభుత్వం) అఫిడవిట్లో ఏ ఆరోపణ చేయడానికైనా వారికి స్వేచ్ఛ ఉంది, మీరు కోరుకున్న వాదన వినిపించేందుకు మీకు స్వేచ్ఛ ఉన్నట్లుగానే’’ అని పేర్కొంది. ఇదిలావుండగా, ఈ అఫిడవిట్ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి దాఖలు చేయవలసి ఉండగా, అదనపు కార్యదర్శి దాఖలు చేయడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఈ న్యాయస్థానాన్ని ఈ కేసులో మీరు వ్యవహరిస్తున్న విధంగా చూడకూడదు’’ అని వ్యాఖ్యానించింది. ఇటువంటి కేసుల్లో ప్రేరేపిత మీడియా రిపోర్టింగ్ను ఆపేందుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ను దాఖలు చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos