గణనీయంగా తగ్గిన రోజా పూల దిగుబడి

హొసూరు : ఇక్కడ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోజా పూల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హొసూరు ప్రాంతంలో సుమారు 10 వేలకు పైగా హెక్టార్లలో రోజా పూలు సాగు చేస్తున్నారు. ఇక్కడ సాగు చేస్తున్న రోజాలను తమిళనాడులోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. విదేశాలలో సైతం హొసూరు రోజా పూలకు మంచి గిరాకీ ఉంది. ఇటీవలి వర్షాలకు దిగుబడి బాగా తగ్గిపోవడమే కాకుండా రోజా చెట్లకు రోగం రావడంతో ఆకులు రాలి, పువ్వులు ఎండిపోతున్నాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెట్లకు సోకిన వ్యాధిని నివారించడానికి ఎన్ని మందులు పిచికారి చేసినా ఫలితం లేకపోవడంతో రోజా పూల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. గత ఏడాది  క్రిస్మస్, కొత్త సంవత్సరాది తదితర పండుగలకు రోజా పూలను ఎక్కువగా విక్రయించి, రైతులు మంచి లాభాలు ఆర్జించారు. ప్రస్తుతం రోజా చెట్లకు వ్యాధి సోకడంతో పూల ఉత్పత్తి తగ్గిందని, దీనివల్ల క్రిస్మస్, కొత్త సంవత్సరాదికి ధరలు బాగా పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఒక రోజా పువ్వును మార్కెట్‌లో పది రూపాయలకు విక్రయిస్తున్నారని, క్రిస్మస్, కొత్త సంతవ్సరాదికి రూ.50 వరకు అమ్ముడు పోవచ్చని అంటున్నారు. రోగాల వల్ల రోజా పూల ఉత్పత్తి మరింత తగ్గవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos