పట్టు బిగిస్తున్న టీమిండియా

  • In Sports
  • September 4, 2021
  • 24 Views
పట్టు బిగిస్తున్న టీమిండియా

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. 205 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 94 పరుగుల వద్ద మొయీన్ అలీ బౌలింగులో లాంగాన్ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి తరలించిన రోహిత్ టెస్టుల్లో ఎనిమిదో సెంచరీ సాధించాడు. విదేశాల్లో రోహిత్‌కు ఇదే తొలి టెస్టు సెంచరీ.
ఓవర్‌నైట్ స్కోరు 43/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 83 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (46) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి నిదానంగా ఆడిన రోహిత్ వికెట్ చేజార్చుకోకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే ఊపు కొనసాగించాడు. అతడికి పుజారా పూర్తి అండగా నిలవడంతో బ్యాట్ ఝళిపించాడు. ఇద్దరూ కలిసి 191 బంతుల్లో 113 పరుగులు జోడించారు.
మరోవైపు, పుజారా కూడా అర్ధ సెంచరీకి చేరువయ్యాడు. వికెట్ల కోసం ఇంగ్లిష్ బౌలర్లు చెమటోడుస్తున్నారు. తొలి సెషన్‌లో బౌలర్లపై పైచేయి సాధించిన పుజారా, రోహిత్, అదే ఊపును రెండో సెషన్‌లోనూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 66 ఓవర్లు ముగిశాయి. టీమిండియా వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. రోహిత్ 101, పుజారా 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత ఆధిక్యం 97 పరుగులకు చేరింది.

తాజా సమాచారం