భారత్‌లో పెరిగిన కుబేరులు..

భారత్‌లో పెరిగిన కుబేరులు..

న్యూఢిల్లీ : భారత్లో అధిక ధరలతో సామాన్యుల ఆదాయాలు అడుగంటిపోతుంటే.. మరోవైపు కుబేరుల సంపద మాత్రం ఊహించని రీతిలో పెరిగిపోతోంది. సంఖ్యా, ఆదాయ పరంగాను గతేడాది వీరి సంఖ్య భారీగా పెరగడం గమనార్హం. కేవలం మూడు వందల లోపు మంది వద్ద దాదాపు రూ.80 లక్షల కోట్లకుపైగా సంపద పోగుబడిందని హురున్ రిస్ట్ లిస్ట్ రిపోర్ట్తో వెల్లడయ్యింది. సంపన్నులు ఏడాదికేడాదికి వేల కోట్లు పోగేసుకుంటున్నారని తేలింది. సోమవారం ”హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024” పేరుతో హురున్ ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. లిస్టెడ్ కంపెనీల షేర్ ఆధారంగా, అన్లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి ఇన్వెస్టర్ రౌండ్ల విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. భారత్లో గతేడాది 2023లో కొత్తగా 94 మంది కుబేరులు జత కావడంతో మొత్తం వీరి సంఖ్య 271కి చేరింది. వీరి సంపద ఒక్క లక్ష కోట్ల డాలర్లు (దాదాపు రూ.83 లక్షల కోట్లు)గా ఉంది.
ఆసియా ఖండంలోనే ముంబయి కుబేరులకు కేంద్రంగా మారింది. దేశ ఆర్థిక రాజధానిలో 92 మంది కుబేరులు ఉన్నారు. చైనాలోని బీజింగ్లో 91 మంది కుబేరులు నమోదయ్యారు. లండన్ తర్వాత కుబేరుల పట్టణంగా ముంబయి నిలిచింది. న్యూయార్క్లో 119 మంది కుబేరులుంటే, లండన్ నగర పరిధిలో 97 మంది ఉన్నారు. గతేడాది కాలంలో ముంబైలో కొత్తగా 26 మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు. ప్రపంచంలోనే టాప్-20 బిలియనీర్లలో ఇద్దరు భారతీయులు చోటు సంపాదించుకున్నారు. టాప్-10లో నిలిచిన రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ వ్యక్తిగత సంపద 115 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9.5 లక్షల కోట్లు) సంపదను కలిగి ఉన్నారు. గతేడాది అంబానీ సంపద 40 శాతం పెరిగింది. 15వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మెన్ గౌతం అదానీ వ్యక్తిగత సంపద 86 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.16 లక్షల కోట్లు)గా హురున్ అంచనా వేసింది. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే 33 బిలియన్ డాలర్లు పెరిగింది.
భారత్ నుంచి ఔషధ రంగంలో 39 మంది, ఆటోమొబైల్ నుంచి 27, కెమికల్స్ నుంచి 24 మంది చొప్పున బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో టెస్లా అధినేత ఎలన్ మస్క్ 231 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. అతని తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 185 బిలియన్ల నికర విలువ సంపదతో రెండో స్థానంలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos