ఔషధ వ్యర్థాలతో నీరు కలుషితం

హొసూరు : ఇక్కడి పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ ఔషధాల తయారీ కంపెనీ వ్యర్థాలను గ్రామ ప్రాంతాలకు అతి చేరువలో పడేయడంతో ఆ ప్రాంతలో తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నది. గ్లోబల్ కాల్షియంకు చెందిన వ్యర్థాలను సోమవారం రాత్రి హోసూరు సమీపంలోని ఆగరం గ్రామ పరిధిలోని ఓ వాగులో పడేసి వెళ్లారు.  సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు ఆ వ్యర్థాలు నీటిలో కలిసిపోవడంతో ఆగరం గ్రామ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతోంది. భరించ లేని వాసన ఆ ప్రాంతాన్ని ఆవరించడంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతోంది. దీనిపై ఆగరం గ్రామ ప్రజలు అధికారులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విచారణ జరిపి, వ్యర్థాలను తొలగించడానికి చర్యలు చేపట్టారు. ఔషధ వ్యర్థాలను వాగులో పడేసిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఔషధ వ్యర్థాలను పడేసి పర్యావరణానికి హాని కలిగిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని ఆగరం గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి వన్యప్రాణులు తరచూ వాగులో నీరు తాగడానికి వస్తుంటాయని స్థానికులు తెలిపారు. ఔషధ రసాయనాలు నీటిలో కలిసిపోవడం వల్ల వన్యప్రాణుల కు హాని కలిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos