మీకు తెలుసా దుర్యోధనుడికీ ఓ గుడి ఉంది..

మీకు తెలుసా దుర్యోధనుడికీ ఓ గుడి ఉంది..

ప్రతి ఒక్కరికి సుపరిచితమైన మహాభారతంలో కృష్ణుడు,పాండవులతో పాటు కౌరవాగ్రజుడు దుర్యోధనుడు కూడా కీలకమే.దుర్యోధనుడి ప్రస్తావన లేకుండా మహాభారతం పూర్తి కాదు.దుర్యోధనుడు అనగానే అతి భయంకరుడు, నీచుడు, దుర్మార్గుడు ఎత్తుకి పై ఎత్తులు వేసే దుష్టిడిగా చెప్పుకుంటారు. అధికారం కోసం ఎంతటికైనా తెగించే దుర్మార్గం గుర్తుకువస్తుంది. మరికొందరేమో దుర్యోధనుడిని స్నేహానికి అభిమానానికి ప్రతీకగా భావిస్తారు.దుర్యోధనుడు దుర్మార్గుడిగా చిత్రీకరించిన చరిత్ర గాథలు,చిత్రాల్లో,పౌరాణిక నాటకాల్లో దుర్యోధునుడి పాలన గురించి,స్నేహం గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.దీంతో చాలా వరకు ప్రతి ఒక్కరికి దుర్యోధనుడు అంటే నీచుడు,దుర్మార్గుడనే భావన నెలకొంది.అయితే కేరళ రాష్ట్రంలోని ఓ కుగ్రామంలో దుర్యోధనుడికి ప్రత్యేకంగా గుడి నిర్మించి దేవుడిగా కొలుస్తుండం ఆశ్చర్యం కలుగుతోంది. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో పోరువళి గ్రామంలో మలనాడు అనే ప్రాంతంలో కొండపై విరుతి మలనాడ ఆలయం నిర్మించారు.మల నాడ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాదు పచ్చని ప్రకృతికి నిలయాలు. చల్లని గాలి, నేత్రాలకు విందును చేసే ఏపుగా పెరిగిని వృక్షాలు, పచ్చని పొలాలు మనస్సుకు దేహానికి విశ్రాంతిని ప్రసాదిస్తాయి.ఆలయ నిర్మాణం వెనుక చరిత్రపుటల్లో ఓ కథ దాగి ఉంది.జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం,అజ్ఞాతవాసం గడపడానికి అడవుల బాట పడతారు.12 ఏళ్ల అరణ్యవాసం అనంతరం పాండవులు ఒక ఏడాది అజ్ఞాతవాసం గడపడానికి సిద్ధమవుతున్నారు.దీంతో పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి మార్గాలు వెతకసాగాడు.ఈ క్రమంలో మలనాడు ప్రాంతంలో నివసిస్తున్న సిద్ధులకి ఏవో అద్భుతమై శక్తులున్నాయని, రహస్యాలు కనుగొంటే కురుక్షేత్రంలో తన విజయం సాధించవచ్చని ఎవరిద్వారానో తెలుసుకుంటాడు. దీంతో మేనమామ శకునితో కలసి సిద్ధుల్ని వెతుకుతూ కేరళలోని మలనాడు ప్రాంతానికి చేరుకున్నాక అలసిపోయి అక్కడే సేద తీరుతుండగా వారిద్దరికీ అక్కడి స్థానికులైన కురువలు స్వాగతం పలికి చల్లటి కొబ్బరి కల్లుతో దాహం తీర్చారు. దాంతో కల్లు రుచితో పాటు అక్కడి ప్రజల ఆతిథ్యాన్నీ, అక్కడి ప్రకృతి అందాలను చూసి ముగ్ధుడైన దుర్యోదనుడు మలనాడు ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమంటూ అక్కడే కొండపై కూర్చొని పరమేశ్వరుని ప్రార్థించాడు.దీంతోపాటు అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో  వంద ఎకరాల పొలాన్ని ప్రాంత వాసులకు దానం చేశాడు.దీంతో ఆ ప్రాంత ప్రజలు తమ కోసం ఇంత చేసిన దుర్యోధనుడిని దేవుడిగా భావించడం మొదలుపెట్టి గుడి నిర్మించారు.దుర్యోధనుడికి ఎంతో ఇష్టమైన కొబ్బరికల్లునే గుడికి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు.అయితే ఈ  ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు. బదులుగా ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది.గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే మూర్తిని ఊహించుకుంటారు. ఆలయంలోనికురవఅనే కులానికి చెందిన వారు మాత్రమే పూజారులుగా సాగడం మరో విచిత్రం. దుర్యోధనుడికి కల్లుని అందించిన వృద్ధురాలుకురవస్త్రీ కావడంతో ఆచారం మొదలై ఉంటుంది.తరతరాలుగా ఇక్కడి భక్తులు తమ ఆయురారోగ్యాలని,పంట పొలాలను కాపాడే దేవుడిగా దుర్యోధనుణ్ణి నిత్య పూజలతో కొలుస్తుంటారు. కేరళ కళా సంస్కృతి, నిర్మాణ శైలిలో ఆలయ ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. ఆకాశమే పై కప్పుగా సప్తవర్ణ రంజిత పుష్పాలు, తళుకులీనే గొడుగులతో ఆలయం ఎంతో అందంగా అలంకరించి ఉంటుంది. ఆలయములోని గర్భగుడిలో నల్లరాతి గద్దె దర్శనమిస్తుంది.దానిమీద ఎలాంటి అర్చామూర్తి లేడు. గద్దె దుర్యోధనుని సింహాసనంగా, దానిమీదే అయన ఆసీనులై ఉన్నారన్న భావనతో భక్తులు పూజిస్తారు. గుడిలో ఉపదేవతలుగా దుర్యోధనుడి భార్య భానుమతి, తల్లి గాంధారి, సోదరి దుస్సల, గురువు ద్రోణుడు, ఆప్తమిత్రుడు, అంగరాజు కర్ణుడు విగ్రహాలను ప్రతిష్టించారు. మార్చిలో జరిగేకెట్టుకజలేదా మలక్కుడ ఉత్సవానికి మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనం వస్తారు. మన బోనాల సందర్భంగా ఎలాగైతే వెదురుతో తొట్టెలు చేస్తామోఅలాగే 100 అడుగుల ఎత్తున అలంకరణలు చేసి వాటిని భుజాన మోస్తారు. ఇప్పటికీ ప్రదేశం ప్రభుత్వ రికార్డులలో దుర్యోధనుడి పేరు మీదుగానే ఉంటుందని అంటారు. చుట్టుపక్కల ఆలయానికి ఉన్న భూములకు శిస్తు కూడా దుర్యోధనుడి పేరిటే ఇప్పటికీ చెల్లిస్తూ ఉండడం విశేషం..
ఇలా చేరుకోవాలి..
విమానమార్గం ద్వారా దుర్యోధనుడి గుడికి చేరుకోవాలంటే ముందుగా త్రివేండ్రంకు చేరుకొని అక్కడి నుంచి పోరువళికి ప్రైవేటు వాహనాలు,బస్సులో చేరుకోవాలి.లేదా కొల్లాం రైల్వేస్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలు,బస్సుల్లో పోరువళికి చేరుకోవచ్చు.పొరువళి
యొక్క కుగ్రామానికి అన్ని ఇతర నగరాలు మరియు పట్టణాల నుండి బస్సు మార్గం ఉంది..

పోరువళిలోని దుర్యోధనుడి గుడి ముఖద్వారం..

 

దుర్యోధనుడు ఆసీనుడైనట్లు భక్తులు భావిస్తున్న వేదిక..

కెట్టుకజ ఉత్సవం..

 

గర్భగుడిలోని నల్లరాతి గద్దె..

దుర్యోధనుడికి ఇష్టమైన కొబ్బరికల్లు..

దుర్యోధనుడికి నైవేద్యంగా మద్యం సమర్పిస్తున్న భక్తులు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos