పార్టీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన బీజేపీ

పార్టీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన బీజేపీ

లక్నో: పార్టీ ఎమ్మెల్యేకు బీజేపీ నోటీసులివ్వడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్యే కుమారుడు, పార్టీ బహిష్కృత నేత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటమే నోటీసులు పంపడానికి కారణంగా తెలుస్తోంది. యూపీ ఫతేపూర్ సిక్రీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌదరి కుమారుడు రామేశ్వర్ చౌదరి అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రాజ్ కుమార్ చాహర్ను మళ్లీ బరిలోకి దింపింది. ఆ స్థానం నుంచి ఎంపీ టికెట్ ఆశించిన రామేశ్వర్ బీజేపీపై అసంతృప్తితో బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేశారు. మే 2న రామేశ్వర్ చౌదరిని బీజేపీ బహిష్కరించింది. ఈ క్రమంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించు కున్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి నందుకుగానూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి.. రామేశ్వర్ తండ్రికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. బాబూలాల్ చౌదరి తన కుమారుడిని బీజేపీ అభ్యర్థిపై ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రచారం చేసేందుకు అనుమతించడంపై నోటీసు జారీ చేసినట్లు భూపేంద్ర తెలిపారు. పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. బాబూలాల్ చౌదరి 2014లో బీజేపీ టికెట్పై ఫతేపూర్ సిక్రీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఆయనను పక్కనబెట్టి, కాంగ్రెస్కు చెందిన రాజ్ బబ్బర్ను ఓడించిన రాజ్ కుమార్ చాహర్ను రంగంలోకి దింపింది. బాబూలాల్ చౌదరి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రామ్నాథ్ సికర్వార్ ఇండియా కూటమి అభ్యర్థిగా ఫతేపూర్ సిక్రీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos