తాలిబన్లతో కేంద్రం చర్చలు జరపాలి

తాలిబన్లతో కేంద్రం చర్చలు జరపాలి

న్యూ ఢిల్లీ : తాలిబన్లను ఇండియా గుర్తించినా గుర్తించక పోయినా వారితో చర్చలకు లాంఛనంగా మార్గాలను తెరిచి ఉంచాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సలహా ఇచ్చారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు తాలిబన్లతో దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచాలని 2013లోనే సలహా ఇచ్చా. నా సలహా ఖాతరు చేయ లేదు. 2019లో అప్ఘనిస్థాన్కు సంబంధించిన వాస్తవాలపై నా ఆందోళన తెలిపాను. పాకిస్తాన్, అమెరికా, తాలిబన్లు మాస్కోలో చర్చలు జరుపుతుంటే, ట్రంప్ను ఆయన ఎన్నిసార్లు ఆలింగనం చేసుకున్నారో పీఎంఓ ఇండియా లెక్కలు వేస్తూ వచ్చింది. ప్రభుత్వ ఆప్ఘనిస్థాన్ విధానం ఏమిటో ఇప్పటికీ మనకు తెలియడం లేదు. భారత దేశం మూడు బిలియన్ డాలర్లు ఆప్ఘనిస్థాన్లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది. షరా మామూలుగానే మోదీ ప్రభుత్వం సంక్షోభం తలుపుతట్టినప్పుడు నాటకీయత మొదలుపెడుతుంది. తాలిబన్లతో చర్చలు జరపాని అంతర్జాతీయ భద్రతా నిపుణులంతా కూడా చెబుతున్నా’రన్నారు.
చైనాపై ఎక్కువగా ఆధారపడడుతూ పోతే దాని ముందు తలవంచాల్సి వస్తుందంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ కొట్టివేశారు. భగవత్ ప్రకటన పూర్తిగా బోగస్ అని అన్నారు. ”భారత భూభాగాలైన గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెమ్చోక్, డెప్సాంగ్లో చైనా తిష్టవేసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు? ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం చైనా అనే మాట మాట్లాడడానికి కూడా భయపడ్డారు. మోహన్ భగవత్ నిజమైన జాతీయవాది అయితే భారత భూభాగంలో చైనా తిష్టవేసిందని చెప్పమనండి. మన భూభాగంలోని ఆయా ప్రాంతాలను భారత ఆర్మీ కంట్రోల్ చేయలేకపోతోందని చెప్పమనండి” అని ఒవైసీ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos