రాక్ గార్డెన్ అందాలు వర్ణించతరమా..

  • In Tourism
  • October 14, 2019
  • 317 Views
రాక్ గార్డెన్ అందాలు వర్ణించతరమా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ కరువుకే కాదు ప్రపంచ ఖ్యాతి గడించిన పుణ్యక్షేత్రాలకు,నల్లమల అడవులు, అరుదైన పక్షులు,వన్యప్రాణులు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పర్యాటక ప్రాంతాలకు కూడా కేంద్రంగా విరాజిల్లుతోంది.అటువంటి ఎన్నో ప్రదేశాలకు నెలవైన కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ రాక్ గార్డెన్,కేతవరం కొండలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న పర్యాటక ప్రాంతాల జాబితాలో ఒకటి.కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో కర్నూలు-నంద్యాల మార్గంలో ఓర్వకల్ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రాక్ గార్డెన్ చూడడానికి దేశవిదేశాల నుంచి సైతం పర్యాటకులు తరలివస్తుంటారు.

ఓర్వకల్‌ రాక్‌ గార్డెన్‌..


ఓర్వకల్‌ రాక్‌ గార్డెన్‌..


సహజ సిద్ధంగా ఏర్పడ్డ రాక్ గార్డెన్లో డిస్నీ బర్డ్ వాచింగ్ స్పాట్ ప్రముఖంగా చూడాల్సిన ప్రదేశం.ఇక్కడ నిలబడి పక్షుల శబ్దాలను, కిలకిలారావాలు, విహారాలు గమనించవచ్చు. లోయలు, కొండలు, నీటి ప్రవాహాలు, అబ్బురపరిచే రాతి దృశ్యాలు, అవి ఏర్పడ్డ తీరు ఇవన్నీ పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.సాయంత్రం సంధ్యాసమయం వేళల్లో రాతికొండలపై నుంచి సూర్యకిరణాల వెలుగుల్లో రంగులు మార్చుకునే దృశ్యం మరింత అద్భుతంగా ఉంటుంది.

విద్యుద్దీపాల వెలుగుల్లో ఓర్వకల్‌ రాక్‌ గార్డెన్‌..


విద్యుద్దీపాల వెలుగుల్లో


రాత్రి వేళల్లో పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన రంగు రంగుల విద్యుద్దీపాల వెలుగుల్లో రాక్ గార్డెన్ రెట్టింపు అందంగా కనిపిస్తూ వర్ణించలేని అనుభూతి పంచుతాయి.పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన రెసార్టులు సైతం గ్రామ వాతావరణాన్ని తలపిస్తూ మరో లోకానికి తీసుకెళతాయి.ఓర్వకల్ రాక్ గార్డెన్ఓర్వకల్ రాక్ గార్డెన్ లో సినిమా షూటింగ్ లు కూడా నిర్వహిస్తుంటారు. ఇప్పటివరకు జయంమనదేరా, టక్కరి దొంగ, సుభాష్ చంద్ర బోస్, శంభో శివ శంభో, బాహుబలి వంటి సినిమాలు చిత్రీకరించారు.అంతేకాదండోయ్‌ రాక్‌ గార్డెన్‌లో సాహస క్రీడలు సైతం ఉల్లాసాన్ని పంచుతాయి.

రాక్ గార్డెన్‌లో రహదారి


గ్రామాన్ని తలపిస్తున్న రెస్టార్టులు..


ఆదిమానవుల ఆవాసం కేతవరం..
రాక్ గార్డెన్ సమీపంలోని కేతవరం కొండలు ఆదిమానవులకు ఆవాసాలుగా ఉండేవని స్థానికంగా లభించిన ఆధారాల ద్వారా తెలుస్తోంది.క్రీ.పూ. ఎనిమిది వేల ఏళ్ల క్రితమే కేతవరం కొండల్లో ఆదిమానవుల సంచారం ఉన్నట్లు ఆనవాళ్లు లభించాయి.పదివేల ఏళ్లనాటి ఆదిమానవుని లిపి, బొమ్మలు, చిహ్నాలు ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామం కొండలపై కనిపిస్తాయి.ఆదిమానవుని జీవిత విశేషాలు, ఆచార వ్యవహారాలు, లిపివర్ణ చిత్రాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

ఆదిమానవుల ఆనవాళ్లు


రాళ్ల మధ్యలో చెరువు


జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శిస్తున్నారు.ఓర్వకల్లో శ్రీ శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశ్వర స్వామి ఆలయం, శ్రీమాతా చౌడేశ్వరి దేవి ఆలయం, సూఫీ హజరత్ సయ్యద్ మహమ్మద్ షా ఖాద్రి దర్గా లు చూడదగ్గవి. ప్రతి సంవత్సరం ఆలయాల వద్ద ఉత్సవాలు, తిరుణాల ఘనంగా నిర్వహిస్తారు దర్గా వద్ద శివరాత్రి తర్వాత ఉరుసు జరుగుతుంది.ఈ రాక్ గార్డెన్ లో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం మరియు పిక్నిక్ స్థలాలు, వసతి కై హరితా రిసార్ట్ ఉన్నాయి..

వాన మబ్బుల్లో..


రాతి బండల కింద ఎంత మధురం


ఇలా చేరుకోవాలి..
ఓర్వకల్ కు సమీపాన కర్నూల్ రైల్వే స్టేషన్ (25 KM) కలదు. అక్కడి నుంచి బస్ స్టాండ్ చేరుకొని, నంద్యాల కు లేదా బనగానపల్లె కు వెళ్లే పల్లెవెలుగు(ఇప్పుడు తెలుగు వెలుగు), ఎక్స్ ప్రెస్ బస్సులు ఎక్కితే ఓర్వకల్ చేరుకోవచ్చు.లేదా నంద్యాల రైల్వే స్టేషన్ ( 50 KM ) చేరుకొని అక్కడి నుంచి కూడా రాక్‌ గార్డెన్‌ చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos