ఒమిక్రాన్ : ఆందోళన అనవసరం

ఒమిక్రాన్ : ఆందోళన అనవసరం

ప్రపంచ దేశాల్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ గణనీయంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు భారత్‌లో 415 కేసులు నమోదు కాగా.. బాధితుల్లో 115 మంది కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. మన దేశంలో ఒమిక్రాన్ బారినపడిన వారిలో అధిక శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ కనబడకపోవడం, ఒకవేళ కొందరిలో కనిపించినా ఈ వేరియంట్ ప్రభావం స్వల్పంగానే ఉన్నట్లు దిల్లీకి చెందిన పలువురు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సోకినప్పటికీ త్వరగా కోలుకొని డిశ్చార్జి అవుతున్నారని లోక్‌ నాయక్‌  జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేష్ పేర్కొన్నారు. తీవ్రమైన లక్షణాలు ఎవరిలోనూ కనబడటంలేదని తెలిపారు.
ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90 శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలూ లేకపోవడం, వాళ్లకు చికిత్సలు కూడా అందించాల్సిన అవసరంలేకపోవడం ఊరటనిచ్చే అంశమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు రాగా.. దిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణ 38, కేరళ 37, తమిళనాడు 34, కర్ణాటక 31, రాజస్థాన్ 22, హరియాణా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో 4 చొప్పున కేసులు రాగా.. జమ్ముకశ్మీర్, బంగాల్‌లలో మూడేసి కేసులు వచ్చాయి. యూపీలో రెండు, చండీగఢ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో కేసు చొప్పున ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నైట్ కర్ఫ్యూలతో పాటు క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.
దక్షిణాఫ్రికాలో తొలిసారి ఒమిక్రాన్‌ను గుర్తించిన వైద్యురాలు డాక్టర్ అంజెలిక్ కూట్జీ కూడా ఇటీవల ఈ వేరియంట్ ప్రభావానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమ దేశంలో ఒమిక్రాన్ సోకిన వారంతా సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారని ఆమె వెల్లడించారు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్‌ను గుర్తించాక ఓ మోస్తరు స్థాయిలో కొన్ని ఔషధాలను ఇవ్వడం ద్వారా కండరాల నొప్పి, తలనొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం పొందొచ్చని సూచించారు. ఆక్సిజన్, యాంటీబయోటిక్స్ వినియోగించాల్సిన అవసరం రాలేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos