తీపి గుర్తులు మిగిల్చే సాగర్ సందర్శన

తీపి గుర్తులు మిగిల్చే సాగర్ సందర్శన

హైదరాబాద్ : నాగార్జున సాగర్ జలాశయం గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా ఏళ్ల తర్వాత ఈ జలాశయం భర్తీ కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఎత్తైన గుట్టలు, అందమైన అడవుల మధ్య నిర్మించిన ఈ జలాశయం పర్యాటకులకు మానసికోల్లాసాన్ని పంచుతోంది. క్రెస్ట్ గేట్లను ఎత్తివేయడంతో 560 అడుగుల పైనుంచి కిందకు దుముకుతూ కృష్ణమ్మ చేసే జల సవ్వడులు, విన్యాసాలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి.
ఆహ్లాదం…లాంచీ ప్రయాణం
ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా భాసిల్లిన నాగార్జున కొండకు జలాశయం మీదుగా లాంచీలో చేసే ప్రయాణం హృద్యంగా ఉంటుంది. దీనికి పెద్దలకు రూ.180, పిల్లలకు రూ.120 చొప్పున వసూలు చేస్తారు. అక్కడే ఉన్న మ్యూజియంలో రాతి యుగం నాటి నాగరికతతో పాటు బౌద్ధ మత ప్రాభవ వైభవాలను వీక్షించవచ్చు. కుడి కాలువ నుంచి మాచర్లకు వెళ్లే రహదారిలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో…ఆచార్య నాగార్జునుని విశ్వ విద్యాలయం, ఇప్పటికీ చెక్కు చెదరని రంగ స్థలం లాంటి సుందర ప్రదేశాలను చూడవచ్చు. వీటితో పాటే 14 కిలోమీటర్ల దూరంలోని ఎత్తిపోతల కనువిందుచేస్తుంది. 70 అడుగుల ఎత్తు నుంచి నీరు లోయలోకి పడుతుంటుంది. ఆ దృశ్యాన్ని చూడాల్సిందే కానీ ఏమాత్రం వర్ణించలేం.
బస ఏర్పాట్లు
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సాగర్‌లో బస చేయడానికి విజయ విహార్ అతిథి గృహాన్ని నిర్వహిస్తోంది. ఇందులో అయిదు నక్షత్రాల హోటల్లో మాదిరి సౌకర్యాలుంటాయనడం అతిశయోక్తి కాదు. ఆన్‌లైన్‌లో గదులను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. సోమ నుంచి గురువారం వరకు ఒక ధర, వారాంతాల్లో మరో ధర ఉంటుంది. మామాలు గదులు ఇరవై ఉన్నాయి. అద్దె రూ.1,568. వారాంతాల్లో అయితే రూ.2,668. డీలక్స్ గదులు ఎనిమిది ఉన్నాయి. అద్దె రూ.2,094, వారాంతాల్లో రూ.3,505. ఆరు షూట్లున్నాయి. వాటి అద్దె రూ.2,950. వారాంతాల్లో రూ.4,368. వివరాలకు 08680 277362, 08680 277363 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos