కర్ణాటకను మేల్కొలిపే పట్టణం ముళబాగిలు..

  • In Tourism
  • October 19, 2019
  • 336 Views
కర్ణాటకను మేల్కొలిపే పట్టణం ముళబాగిలు..

కర్ణాటక రాష్ట్రంలో పురాతన దేవాలయాలు,చారిత్రాత్మక ఘట్టాలకు నిలువెత్తు సాక్షంగా నిలిచే ప్రదేశాల్లో ముళబాగిలు పట్టణం ముందువరుసలో ఉంటుంది.కర్ణాటక రాష్ట్రంలో సూర్యుడు మొట్టమొదట ఉదయించే పట్టణంగా ముళబాగిలు ప్రసిద్ధి చెందింది.కోలారు జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముళబాగిలు అటు ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులను పంచుకుంటుండడంతో తెలుగు-కన్నడ సంస్కృతులు,భాషలు మిళితమై ఉంటాయి.ఇక్కడి ప్రజలు కన్నడ భాషతో పాటు తెలుగు భాషను సైతం మాతృభాషగానే భావిస్తుంటారు. ముళబాగిలు పట్టణానికి మూడలబాగిలు అనే పేరు కూడా ఉంది.ఒకప్పటి మైసూరు రాష్ట్రానికి పశ్చిమ ద్వారంగా ఉండడంతో ఈ పట్టణానికి మూడలబాగిలు అనే పేరు వచ్చినట్లు స్థానిక చరిత్ర ద్వారా తెలుస్తోంది.కాల క్రమంలో ఇది కాస్తా ముళబాగిలుగా పేరు మార్చుకుంది. ముళబాగిలు పట్టణంతో పాటు పట్టణం చుట్టూ అనేక పర్యాటక ప్రాంతాలు,శతాబ్దాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ముళబాగిలు పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయం.కురుక్షేత్ర యుద్ధం సమాప్తమయ్యాక పాండవుల్లో మధ్యముడైన అర్జునుడు ముళబాగిలు పట్టణంలో ఈ హనుమంతుడి దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.అంతేకాదు ఈ ఆలయంలోని సీతారామ,లక్ష్మణ విగ్రహాలతో పాటు పద్మావతి,శ్రీనివాసుల విగ్రహాలను వశిష్ట మహర్షి స్వయంగా ప్రతిష్టించినట్లు స్థానిక చరిత్ర ద్వారా తెలుస్తోంది.

హనుమంతుడి దేవాలయం


పాదరాజ మఠం :
ముళబాగిలు పట్టణం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు-తిరుపతి రహదారిపై ఉన్న పాదరాజ మఠానికి శతాబ్దాల చరిత్ర ఉంది.పాదరాజ మఠంలో వెలసిన యోగా నరసింహస్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.ఇక్కడి కోనేరులో అన్ని రుతువుల్లోనూ నీటిమట్టం ఒకేవిధంగా ఉండడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇక ప్రతిఏటా పాదరాజ మఠంలో నిర్వహించే ఆరాధన ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.గురు రాఘవేంద్ర స్వామి నరసింహ తీర్థంలోనే విద్యాభ్యాసం చేసినట్లు ఇక్కడి స్థానికులు చెబుతుంటారు..

శ్రీపాదరాజ మఠంలో యోగా నరసింహ స్వామి


విరూపాక్షస్వామి ఆలయం :
పట్టణం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విరూపాక్షస్వామి దేవాలయం సుమారు 13వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించినట్లు ఇక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.దేవాలయం శైలి కూడా విజయనగర రాజుల శిల్పకళావైభవాన్ని చాటుతుంది.విరూపాక్షస్వామి దేవాలయంలో విరూపాక్ష లింగాన్ని గురు దత్తాత్రేయ తండ్రి అట్రి మహర్షి ప్రతిష్టించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.ఈ లింగం సూర్యోదయం,సూర్యస్తమయ సమయాల్లో రంగులు మారుతుండడం మరో విశేషం.అంతేకాదు చాలా అరుదుగా కనిపించే బగల్ముఖి దేవాలయం కూడా ఈ విరూపాక్ష దేవాలయంలో నిర్మించిడం గమనార్హం..

విరూపాక్షస్వామి ఆలయం


గరుడ ఆలయం :
రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా అరుదుగా కనిపించే గరుడ దేవాలయాల్లో ఒకటి ముళబాగిలు పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో కొలదేవి అనే గ్రామంలో ఉంది.ఇక్కడ గరుడ ఆలయం శ్రీ రామానుజాచార్య నేతృత్వంలో నిర్మించబడిందని స్థానిక చరిత్ర ద్వారా తెలుస్తోంది.ఈ గరుడ ఆలయానికి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.ఖాండవ వనం దహనం సమయంలో మరణించిన పాములు పెట్టిన శాపం నుంచి విముక్తి పొందడానికి అర్జునుడు కొలదేవిలో గరుడ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.మరొకటి రామాయణంలో సీతను రావణాసురుడు అపహరించి తీసుకెళుతున్న సమమంలో జటాయువు అడ్డుకోగా రావణుడు కత్తితో జటాయువును సంహరిస్తాడు.సదరు జటాయువు కొలదేవిలో మరణించిందని అందుకే ఇక్కడ గరుడ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు..

గరుడ ఆలయం


కురుడుమలె :
పట్టణం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుడుమలె గణపతి దేవాలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి.ఇక్కడి గణపతిని దర్శించుకోవడానికి రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.21 అడుగుల ఎత్తుతో శాలిగ్రామ్ అనే ఏకశిల గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.ఈ దేవాలయాన్ని సుమారు ఐదు వేల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు స్థానికులు తెలుపుతుంటారు.

కురుడుమలెలో 21 అడుగుల గణపతి..


కోటి లింగేశ్వర :
ముళబాగిలు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కమ్మసంద్ర గ్రామంలో ఉన్న కోటి లింగేశ్వర కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది.మంజునాథ అనే శివుడు భక్తుడు కోటి శివలింగాలు ప్రతిష్టించి ప్రతిరోజూ పూజిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి కోటి లింగేశ్వర పేరు వచ్చిందని స్థానిక చరిత్ర చెబుతోంది.కోటి లింగాల మధ్య సుమారు 108 అడుగుల ఎత్తు 35 అడుగుల వెడల్పు ఉండే భారీ శివలింగం కోటిలింగేశ్వరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.మొత్తం 15 ఎకరాల్లో ఉన్న కోటిలింగేశ్వరలో కోటి శివలింగాలు ఒకేచోట చూసి భక్తులు భక్తి పారవశ్యానికి లోనవుతారు..

కోటి లింగేశ్వర


అవని :
దేశంలో సీతాదేవికి ఉన్న అతికొద్ది ఆలయాల్లో అవని కూడా ఒకటి.రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మికి మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉండేదని సీతాదేవి గర్భిణిగా ఉన్న సమయంలో ఇక్కడే ఆశ్రయం పొందారని స్థానిక చరిత్ర.అంతేకాదు సీతారాముల సంతానమైన లవకుశల జననం కూడా ఇక్కడే జరిగిందని బాల్యంతో పాటు అశ్వమేధ యాగంలో భాగంగా బంధించిన గుర్రాన్ని విడిపించుకోవడం కోసం లవకుశలు తమ తండ్రి రాముడితో తలపడడానికి కూడా సిద్ధమైన ప్రదేశం ఇదేనని చరిత్ర ద్వారా తెలుస్తోంది.అంతేకాదు రామావతారం అనంతరం ద్వాపరియుగంలో కృష్ణుడు శమంతకమణి కోసం జాంబవంతుడితో పోరాడింది అనంతరం జాంబవతిని వివాహం చేసుకుంది ఇక్కడేనని స్థానిక చరిత్ర.ఇక్కడి ఆలయంలోని శారద దేవి ప్రతిమను ఆది గురువు శంకరాచార్య స్వామీజీ ప్రతిష్టించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.దక్షిణభారత దేశ గయగా గుర్తింపు ఉన్న అవనిలో ప్రతిఏటా జరిగే ఘనంగా జాతరలు నిర్వహిస్తుంటారు..

అవని


ఇవే కాదు బంగారు తిరుపతి,చాముండేశ్వరి ఆలయం,వరదరాజ స్వామి దేవాలయం ఇలా ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలు ముళబాగిలు పట్టణంలో చూడవచ్చు.అంతేకాదు మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధానికి కూడా ముళబాగిలు సాక్షిగా నిలిచింది.వీటితో పాటు పట్టణం చుట్టుపక్కల ఎన్నో పర్యాటక ప్రాంతాలు,రాక్ క్లైంబింగ్,ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలకు అనువైన ప్రాంతాలు ఉన్నాయి.అటు ఆంధ్ర ఇటు కర్ణాటకతో పాటు తమిళనాడు రాష్ట్ర సరిహద్దులను కూడా పంచుకుంటున్న నేపథ్యంలో ముళబాగిలు అనేక వాణిజ్య పంటలకు,వ్యాపారాలకు కేంద్రంగా నిలుస్తోంది.ఆలూ,బీన్స్,బీట్రూట్,క్యారెట్,క్యాబేజీ ముఖ్యంగా టమోట పంటలకు ముళబాగిలు ప్రసిద్ధి చెందింది.దేశంలోనే టమోటాలకు అతిపెద్ద రెండవ మార్కెట్ వడ్డహళ్లి ముళబాగిలు పది కిలోమీటర్ల దూరంలో ఉంది.పట్టణంలోని ముస్లింలు తయారు చేసే బీడీలకు కర్ణాటక,ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో సైతం విపరీతమైన డిమాండ్ ఉంది.15 ఏళ్ల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బహుభాష హీరోయిన్ సౌందర్య సొంత గ్రామం ముళబాగిలు పట్టణానికి కూతవేటు దూరంలోనే ఉంది.కోలారు బంగారు గనులుగా ప్రపంచ ఖ్యాతి గడించిన కోలారు గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్) పట్ణణం ముళబాగిలు నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.బంగారు గనుల కోసం జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ సైనైడ్ కొండలు కేజీఎఫ్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి..

సైనైడ్ కొండలు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos