అవినీతి ఆరోపణలతో బిహార్‌ విద్యా మంత్రి రాజీనామా

అవినీతి ఆరోపణలతో బిహార్‌ విద్యా మంత్రి రాజీనామా

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు వెల్లు వెత్తడంతో బిహార్ విద్యాశాఖా మంత్రి మేవాలాల్ చౌదరి గురువారం పదవికి రాజీనామా చేశారు. మూడు రోజుల కిందటే కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు 14 మంది మంత్రులుగా స్వీకార ప్రమాణాల్ని చేశారు. తారాపూర్ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవాలాల్ చౌదరికి విద్యా శాఖను కేటాయించారు. గతంలో ఆయన భాగల్పూర్ వ్యవసాయ విశ్వ విద్యాయ ఉపకులపతిగా పని చేశారు. అప్పుడు నిర్మించిన పలు భవనాల వ్యయాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, లంచం తీసుకుని అర్హతలేని వారికి యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ శాస్త్రవేత్తలుగా నియమించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మేవాలాల్కు మంత్రి పదవి కట్టబెట్టడం పట్ల ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లు వెత్తాయి. తన పదవిని కాపాడుకునేందుకు నితీశ్ అవినీతి పరులకు మంత్రి వర్గంలో చోటు కల్పించారని ఆర్జేడీ నేతలు ఆరోపించారు. ఒక కార్యక్రమానికి హాజరైన మేవాలాల్ చౌదరి జాతీయ గీతం తప్పుగా ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా’ కు బదులుగా ‘పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా’ అని పాడటంతో ప్రతిపక్షాలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అవినీతి కేసుల మంత్రికి జాతీయ గీతం కూడా ఆలపించడం రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos