యానా ఎంతచూసినా తనివి తీరునా?

  • In Tourism
  • October 24, 2019
  • 232 Views
యానా ఎంతచూసినా తనివి తీరునా?

కర్ణాటక రాష్ట్రంలో కరావళి(తీర ప్రాంత జిల్లాలను కన్నడలో కరావళిగా పిలుస్తారు) జిల్లాల్లో ఒకటైన ఉత్తర కన్నడ జిల్లా దట్టమైన పశ్చిమ కనుమల అడవులు,పలు జాతుల పక్షులు,వన్యప్రాణాలకు ఆలవాలంగా ఉంటోంది.పర్యాటక స్థలాలు పెద్దగా లేకపోయినా ఉత్తర కన్నడ జిల్లా పర్యాటకులను ఆకర్షిస్తుండడం విశేషం.కేవలం జిల్లాల్లోని పశ్చిమ కనుమల అడవుల్లో ట్రెక్కింగ్,నదీ తీరాలు,లోయలు,ఫిషింగ్ క్యాంప్లు కోసమే పర్యాటకులు ఉత్తర కన్నడ జిల్లాను సందర్శిస్తుంటారు.జిల్లాలో ఉన్న కొన్ని పర్యాటక ప్రాంతాల్లో యానా గ్రామంలోని అద్భుతమైన సహజసిద్ధంగా ఏర్పడ్డ ఎత్తైన శిలలు ప్రముఖమైనవి.జిల్లాలోని అడవుల మధ్య గూడు కట్టుకున్న యానా అనే గ్రామంలో ఏర్పడ్డ సహజసిద్ధమైన శిలలు చూడడానికి రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు.

యానా శిఖరాలు


ఈ శిలల వెనుక ఆసక్తికర ఇతిహాసాలు ఉన్నట్లు స్థానికులు చెబుతారు.అందులో ఒకటి భస్మాసరుడి కథ.ఘోరమైన తపస్సుతో పరమ శివుడిని మెప్పించిన భస్మాసరుడు అనే రాక్షసరాజు తాను ఎవరితలపై చెయ్యి పెడితే వారు కూలిబూడిదైపోవాలనే వరాన్ని పొందుతాడు.అయితే వరం పని చేస్తుందో లేదో పరీక్షించుకోవడానికి భస్మసరుడు తన చేతిని శివుడిపైనే ఉంచాలని ప్రయత్నిస్తాడు.దీంతో భస్మసరుడి బారి నుంచి తప్పించుకోవడానికి విష్ణుదేవుడి సహాయం కోరుతూ భూమికి వస్తాడు.అందుకు అంగీకరించిన మహా విష్ణువు భస్మసరుడిని అంతమొందించడానికి మోహిని అవతారంలోకి మారతాడు.మోహిని అందానికి మైమరచిన భస్మసురుడు మోహినిని తన వశపరుచుకోవడానికి యత్నిస్తాడు.

భైరవ శిఖరం..


అయితే అందుకు తనతో నృత్యంలో పోటీ పడి గెలవాలని షరతు విధించగా అందుకు అంగీకరించిన భస్మసరుడు మోహినతో కలసి నాట్యం చేయడం ప్రారంభిస్తాడు.ఈ క్రమంలో తనకు శివుడు ఇచ్చిన వరాన్ని మరచిపోయి మోహిని చేసినట్లే తన తలపై చేయ్యిని పెట్టుకొని భస్మమవుతాడు.ఇలా భస్మాసురుడి బూడిద నుంచి వెలువడ్డ శిలలుగా ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్న చరిత్ర.చిక్కటి నలుపు,క్వార్ట్జ్‌ సున్నపురాయితో కూడిన స్పటికాకార భైరేశ్వర,మోహిని శిఖరాలుగా పిలువబడే ఎత్తైన శిలలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

శిఖరాల కింద గుహాలయం..


ఈ శిఖరాల కింద గుహల్లో శివలింగం స్వయంభూశివలింగమని స్థానికులు చెబుతారు.మహా శివరాత్రి పర్వదినాన పది రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. యానా ప్రాంతం దట్టమైన అడవుల మధ్య ఉండడంతో ట్రెక్కింగ్‌ అంటే ఇష్టపడే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.సహ్యాద్రి కొండ శ్రేణి యొక్క జీవవైవిధ్య హాట్‌స్పాట్‌గా ఉన్నందున ఈ ప్రాంతాన్ని జీవవైవిధ్య పరిరక్షణ చట్టం 2002 ప్రకారం రక్షించాలని సూచించారు.

గుహ లోపలి దృశ్యం


గుహ లోపలి దృశ్యం


యానాకు వెళ్లినపుడు కాస్త జాగ్రత్త సుమా.ఎందుకంటే శిఖరాలకు వందల సంఖ్యలో తేనెటీగలు తేనెపట్టులు ఉంటాయి.ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తేనెటీగల దాడికి గురికాక తప్పదు.

శిఖరం రాళ్లకు తేనెపట్టులు


ఇక్కడి సమీపంలోనే ఉన్న విభూతి జలపాతం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.పశ్చిమ కనుమల అడవుల మధ్యలో ఎత్తైన కొండల పైనుంచి జాలువారే విభూతి జలపాతాల్లో స్నానం చేయడం నిజంగా వర్ణించలేని అనుభూతిగా మిగులుతుంది.దీంతోపాటు మిర్జాన్ కోట కూడా తప్పకుండా చూడాల్సిందే.

విభూతి జలపాతం.


విభూతి జలపాతం.


ఇక యానాకు సమీపంలోనున్న గోకర్ణ కూడా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.హాసన్ జిల్లాలోని అతి పెద్దదైన బాహుబలి విగ్రహానికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహామస్తాకాభిషేకాల్లో వినియోగించే జలాన్ని గోకర్ణ తీర్థం నుంచే తీసుకెళ్లడం విశేషం.ఆధ్యాత్మికతతో పాటు అందమైన సముద్రతీరం కూడా గోకర్ణ సొంతం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos