కూతురిపై ఇంత కక్షా!

కూతురిపై ఇంత కక్షా!

గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో తాజాగా మరో విషయం వెలుగు చూసింది. కూతురు అమృత అంటే మారుతిరావుకు వల్లమాలిన ప్రేమ ఉండేది.అటువంటిది తమకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని భావించిన మారుతీరావు మధనపడ్డాడు.కులాంతర వివాహంతో అప్పటికే కూతురు అమృతపై పీకలదాక కోపం పెంచుకున్న మారుతీరావు తమ పెళ్లి,రిసెప్షన్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో ప్రణయ్‌,అమృతలపై మరింత కోపంతో రగిలిపోయాడు.ప్రణయ్‌,అమృతలపై కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో పక్క పథకం రచించినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.ప్రణయ్‌ను హత్య చేయడానికి మొదట మిర్యాలగూడలోని కిరాయి హంతకులను సంప్రదించగా ఫలితం లేకపోవడంతో స్నేహితుడైన కరీం ద్వారా ఐఎస్‌ఐ మాజీ తీవ్రవాదులు బారీ,అజ్గర్‌ అలీలను సంప్రదించాడని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.మారుతీరావు విషయం చెప్పగానే అజ్గర్‌అలీకి గతంలో రాజమండ్రి జైలులో పరిచయమైన బిహార్‌కు చెందిన సుభాష్‌ శర్మతో ఈ హత్య చేయించడానికి నిర్ణయించుకున్నాడు.వెంటనే కరీంను పిలిపించి హత్యకు పథకం రూపొందిస్తానని అందుకు రూ.1 కోటి ఖర్చవుతుందంటూ తెలపడంతో ఇదే విషయాన్ని కరీం తన స్నేహితుడు మారుతీరావుకు తెలియజేశాడు.ఆ తర్వాత సుభాష్ శర్మకు ప్రణయ్‌ హత్య గురించి వివరించి రూ.15లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని బిహార్‌ నుంచి రప్పించారు. మిర్యాలగూడలో కరీం ఇంట్లో ఆశ్రయం పొందిన సుభాష్‌ శర్మ 45 రోజుల పాటు మకాం వేసిన సుభాష్ శర్మ పలుమార్లు ప్రణయ్‌ హత్య కోసం రెక్కీ నిర్వహించాడు.రెండు సార్లు ప్రణయ్‌ హత్యాప్రయత్నం విఫలమైంది. మూడోసారి అమృతవర్షిణి ఆస్పత్రికి వెళ్లిన సమయంలో మారుతీరావు ఇచ్చిన పక్కా సమాచారంతో సుభాష్ శర్మ ప్రణయ్‌ని హత్య చేశాడు. బారీ, అస్గర్‌అలీ సంఘటనా స్థలానికి సమీపంలోనే ఉండి హత్యను పర్యవేక్షించారు.కాగా కూతురు అమృతపై కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రణయ్‌ను హత్య చేయించడమే కాకుండా అమృత వర్షిణికి తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కకూడదని ప్రధాన నిందితుడైన తండ్రి మారుతీ రావు నిర్ణయం తీసుకున్నాడు. ఆ మేరకు వీలునామా కూడా రాసినట్లు పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ ను బట్టి తెలుస్తోంది. ప్రణయ్‌ హత్య కేసులో మారుతీరావుకు ఉరి శిక్షే సరైందని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సమర్పిస్తున్నామని పోలీసులు చార్జిషీట్‌లో అన్నారు. మొత్తం 120 మందిని విచారించిన పోలీసులు 1600 పేజీల్లో చార్జిషీట్‌ నివేదికను పొందుపర్చి హత్యలో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos