దేశంలోనే రెండో పెద్ద గుహలు మన బెలూం గుహలు..

  • In Tourism
  • October 11, 2019
  • 392 Views
దేశంలోనే రెండో పెద్ద గుహలు మన బెలూం గుహలు..

రాయలసీమ పేరు వినగానే కరువు సినిమాల్లో చూపించే ఫ్యాక్షన్ గొడవలు రక్తపాతం ఇవే గుర్తుకు వస్తాయి.కానీ రాయలసీమ చరిత్ర గురించి లోతుగా తెలుసుకుంటే ప్రపంచానికి తెలియని ఎన్నో పోరాట ఘట్టాలు,కట్టడాలు, చరిత్ర,సంస్కృతి అంతకంటే లెక్కలేనన్ని పర్యాటక,ఆధ్యాత్మిక ప్రదేశాలు కనిపిస్తాయి. రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో ఒకటైన కర్నూలు జిల్లా కూడా ఎన్నో పోరాట ఘట్టాలు, కట్టడాలు,ఆధ్యాత్మిక ప్రదేశాలు పచ్చటి నల్లమల అడవులు,తుంగభద్ర తదితర నదులతో తులతూగుతోంది.

బెలూం గుహల్లోకి ఏర్పాటు చేసిన దారి


అనేక పర్యాటక ప్రాంతాలకు నెలవైన కర్నూలు జిల్లాలో బెలూం గుహలు కూడా ప్రధానమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నాయి. భారతదేశంలో మేఘాలయ గుహల అనంతరం అతిపెద్ద,పొడవైన గుహలుగా బెలూం గుహలు ఖ్యాతి గడించాయి.కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.పది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బెలూం గుహల్లో పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత .

బెలూం గుహల్లో లోపల దృశ్యం..


బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.క్రీ.పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది. 1884 లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురుంచి ప్రస్తావించాడు.అనంతరం 1982లో డేనియల్ జెబోర్ నాయకత్వంలోని జర్మన్ నిపుణుల బృందం స్థానికుల సహాయంతో వీటిని సందర్శించి బెలూం గుహల ఉనికిని ప్రపంచానికి తెలియజేసింది.

బెలూం గుహల్లో లోపల దృశ్యం..


బెలూం గుహల ప్రత్యేకత వెలుగు చూడగానే 1985లో బెలూం గుహలను తమ అధీనంలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం బెలూం గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల్ దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు.సహజత్వానికి లోపం రాకుండా బెలూం గుహల అందాలు ద్విగుణీకృతమయ్యే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు.

పర్యాటకుల కోసం రాతి బెంచీలు


దిగుడు బావి మాదిరిగా ఉన్న ప్రవేశద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చేసి, భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు.గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటుచేశారు . గుహల్లోపల ఫౌంటెన్, కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. బెలూం గ్రామ సమీపంలో గల చదునైన వ్యవసాయ భూమి అడుగున ఈ గుహలు ఉన్నాయి.ఈ గుహలకు దిగుడు బావి వంటి మూడు దారులు ఉన్నాయి.

గుహ లోపల జలధార


ఈ గుహల్లోకి వెళ్లేదారి బిలంలా ఉండడంతో వీటిని బిలం గుహలుగా పిలిచేవారని, అదే పేరు కాలక్రమంలో బెలూం గుహలుగా మారిందని భావిస్తున్నారు.గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను ‘స్టాలక్ టైట్’ లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనపడే ఆకృతులను ‘స్టాలగ్ మైట్’ లని అంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి, స్థానికులు వీటికి కోటిలింగాలు, మండపం, సింహద్వారం, పాతాళగంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను ఆధ్యాత్మికతతో ముంచెత్తుతుంది.

గుహ లోపల దృశ్యం


గుహ లోపల దృశ్యం


గుహ లోపల దృశ్యం


క్రీ.పూ 4500 సంవత్సరంలో గుహలు ఏర్పడినట్లు గుహల్లో లభించిన పాత్రలు,గోడల పురాతనతత్వం చూస్తే అర్థమవుతోంది.అంతేకాదు ఇది విశాఖపట్టణంలోని బొర్రా గుహల కంటే పొడవు,విశాలమైనవి పూరతనమైనవి కూడా.అందుకే బెలూం గుహలను చూడడానికి దేశవిదేశాల నుంచి సైతం పర్యాటకులు పెద్ద సంఖ్యలు తరలి వస్తుంటారు..

గుహ పైకప్పు నుంచి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులు


సహజ సిద్ధంగా ఏర్పడ్డ శివ లింగం


ఇలా చేరుకోవాలి..
బెలూం గుహలు కర్నూలు కు 110 కిలోమీటర్లు, హైదరాబాద్ కు 320 కిలోమీటర్లు, బెంగుళూరు కి కూడా 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నంద్యాలకు 70 కిలోమీటర్లు, తాడిపత్రికి 35 కిలోమీటర్లు, జమ్మలమడుగుకు 75 కు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.అన్ని ప్రాంతాలకు ప్రధాన నగరాలైన హైదరాబాద్,బెంగళూరు,చెన్నై నగరాల నుంచి రైలు,బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.

largest-longest-cave-system-belum-caves

తాజా సమాచారం

Latest Posts

Featured Videos