నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువ చేసే భూమి కబ్జా

నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువ చేసే భూమి కబ్జా

హొసూరు : హొసూరు పారిశ్రామిక వాడలోని చిన్నయలసగిరిలో రూ.కోట్లు విలువ చేసే భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారు. గ్రామానికి చెందిన నాగరాజుకు పూర్వీకుల నుంచి సంక్రమించిన రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ప్రస్తుతం రూ.కోట్లు విలువ చేస్తోంది. భూమి పంపకంలో  అన్నదమ్ముల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. కోర్టులో కూడా వ్యాజ్యాలున్నాయి. ఈ భూమిని కబ్జా చేయడానికి రాణి అనే

మహిళ రంగంలోకి దిగింది. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి కబ్జా చేసింది. భూకబ్జాను పసిగట్టిన నాగరాజు, అతని అన్నదమ్ములు రాణిని నిలదీయగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. వారి సహకారంతో నాగరాజు నివాసం ఉంటున్న ఇల్లును ఖాళీ చేయించడమే కాక పునాదులు సహా జేసీబీతో పెకిలించివేయించింది. నాగరాజు కుటుంబీకులు రోడ్డున పడ్డారు. అతనితో పాటు

సోదరులు కృష్ణగిరి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. రాణి తమను రౌడీలతో కొట్టించడమే కాకుండా, పోలీసుల సహాయం తీసుకుని తమను ఇంటి నుంచి గెంటివేయించిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆస్తి పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య కోర్టు కేసులుండగా, నకిలీ పత్రాలతో ఎలా కబ్జా చేయగలుగుతారని వారు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కబ్జాకు గురైన తమ భూమిని తిరిగి ఇప్పించాలని వారు కోరారు. అధికారులు తమను ఆదుకోకపోతే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos