పెళ్లికి నిరాకరించాడని ప్రియుడి హత్యకు పథకం..

పెళ్లికి నిరాకరించాడని ప్రియుడి హత్యకు పథకం..

ఫేస్ బుక్ లో పరిచయం అయిన మహిళతో చనువు పెంచుకున్నాడో యువకుడు. దీన్ని ఆసరాగా తీసుకున్న మహిళ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. వయసు తేడా ఉన్నందున ఇంట్లో ఒప్పుకోరని చెప్పడంతో కక్ష పెంచుకుని ప్రియుడి హత్యకే పథక రచన చేసింది. అదృష్టవశాత్తు విషయం బయటపడడంతో బతికిపోయాడు. చెన్నై శివారు సైదాపేట పరిధిలోని తేనివీరపాండి సమీపం కాట్టునాయక్కనపట్టి ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్ (28) బెంగళూరులోని ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. సందర్భంలో ఫేస్ బుక్ లో మలేషియాకు చెందిన అముదేశ్వరి అనే మహిళతో పరిచయం అయ్యింది. ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. నగదు లావాదేవీలు కూడా జరిగినట్లు సమాచారం. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని అముదేశ్వరి కోరడంతో అశోక్ నిరాకరించాడు. ఇద్దరి మధ్య వయసు తేడా ఎక్కువైనందున ఇంట్లో ఒప్పుకోరని తిరస్కరించాడు.కొన్ని రోజుల తర్వాత కవిత అనే మహిళ అశోక్ కు ఫోన్ చేసి ‘నేను అముదేశ్వరి సోదరిని, నువ్వు పెళ్లికి నిరాకరించడంతో మా అక్క ఆత్మహత్య చేసుకుంది’ అంటూ తెలిపింది. విషయాన్ని అశోక్ పనిచేస్తున్న కార్యాలయంలోనూ చెప్పడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో అశోక్ కుమార్ స్వగ్రామం కాట్టునాయక్కన పట్టికి వచ్చేశాడు. తీరా వచ్చాక కవిత రంగంలోకి వచ్చింది.తననైనా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అశోక్ ఇష్టపడలేదు. కవిత ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు తెలిసాయి. కవిత, అముదేశ్వరి ఒక్కరేనని, ఆమె అసలు పేరు విఘ్నేశ్వరి (45) అని తేలింది. దీంతో విఘ్నేశ్వరిని పోలీసులు మందలించి పంపించేశారు. ఇది మనసులో పెట్టుకున్న విఘ్నేశ్వరి అశోక్ కు చంపాలని పథక రచన చేసింది.ఇందుకోసం తొమ్మిది మంది బృందంతో ఒప్పందం కుదుర్చుకుని అశోక్ కుమార్ ఫోన్ నంబరు, ఫొటో పంపింది. దీంతో అశోక్ కోసం వచ్చిన దుండగులు బోడిలోని లాడ్జిలో బస చేశారు. వారి ప్రవర్తన అనుమానంగా ఉండడంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు విఘ్నేశ్వరి కోసం గాలిస్తున్నారు.

 

తాజా సమాచారం