విజిలెన్స్ వలలో లంచగొండి అధికారిణి

విజిలెన్స్ వలలో లంచగొండి అధికారిణి

హోసూరు : ఇక్కడికి సమీపంలో ఉచిత విద్యుత్ పథకం కింద లబ్ది పొందిన రైతు వద్ద లంచం తీసుకొన్న విద్యుత్ శాఖ అధికారిణిని విజిలెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా కెలమంగలం యూనియన్ చిన్నట్టి గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ 2001లో ఉచిత విద్యుత్ పథకం కింద తన పొలానికి విద్యుత్ కావాలని దరఖాస్తు చేసుకొన్నాడు. 19 ఏళ్ల తరువాత తమిళనాడు విద్యుత్ శాఖ అతనికి విద్యుత్ కనెక్షన్ మంజూరైంది. ఈ విషయంపై వెంకటేష్ కెలమంగలంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలోని అధికారులను సంప్రదించాడు. ఉచిత విద్యుత్ కనెక్షన్ పొందాలంటే తనకు రూ.30 వేలు లంచం ఇవ్వాలని విద్యుత్‌ శాఖ అధికారిణి తెన్నరసి డిమాండ్ చేసింది. దీంతో అవాక్కయిన వెంకటేష్ కృష్ణగిరిలోని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన విజిలెన్స్ అధికారులు రసాయనంతో తడిపిన రూ.10 వేల కరెన్సీని విద్యుత్ శాఖ అధికారిణికి ఇవ్వాలని రైతు వెంకటేష్‌కు సూచించారు. ఆ నగదును వెంకటేష్ విద్యుత్ శాఖ అధికారిణికి ఇస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకుని ఆమెను అరెస్టు చేశారు. కేవలం రూ.10 వేల లంచానికి కక్కుర్తి పడిన విద్యుత్ శాఖ అధికారిణి నిర్వాకం కెలమంగలం ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos