ఇది మొదటి అడుగు మాత్రమే: కేటీఆర్‌, జగన్‌

ఇది మొదటి అడుగు మాత్రమే: కేటీఆర్‌, జగన్‌

హైదరాబాద్‌: దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని సమాఖ్య స్ఫూర్తితో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ భావించారని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగానే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలను కలిసి మద్దతు కోరినట్లు చెప్పారు. బుధవారం వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డితో కేటీఆర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నాయకులు మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాం. ఆయన సానుకూలంగా స్పందించడంతో వచ్చి వారి బృందాన్ని కలిసి అన్ని విషయాలను పంచుకున్నాం. తప్పకుండా ఒకే ఆలోచనాధోరణి ఉన్న నేతలందరూ ఒకే వేదికపై వస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ ఉండాలన్న ఆలోచన ఉన్నవాళ్లు కలిసి వస్తారని మాకు విశ్వాసం ఉంది. ఇటీవల కేసీఆర్‌ ఏవిధంగానైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో చర్చించారో అదే విధంగా త్వరలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికీ వెళ్లి జగన్‌తో భేటీ అయి మిగిలిన విషయాలను మాట్లాడతారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేసీఆర్‌, కేశవరావు, కవిత సహా మా పార్టీ నేతలందరం స్పష్టంగా చెప్పాం.’’ అని అన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి‌ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌గారు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత తారక్‌(కేటీఆర్‌) వచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి నాతో చర్చించారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల గురించి, అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలంటే, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలవాల్సి ఉంది. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కు లేకుండా పోయింది. ఇలాంటి వాటిని అధిగమించాలంటే ఒక్కో రాష్ట్రం పరిధిలో వాళ్లకున్న ఎంపీల సంఖ్యపరంగా చూస్తే, అధిగమించే పరిస్థితి ఉండదు. 25మంది ఎంపీలతో ప్రత్యేకహోదా కోసం మేము డిమాండ్‌ చేసినా, పట్టించుకునే పరిస్థితి లేదు. వారికి తోడు తెలంగాణ నుంచి మరో 17మంది ఎంపీలు కూడా జతకూడితే, మొత్తం 42మంది ఎంపీలు ఒకే తాటిపైకి వచ్చి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి పోరాడితే మేలు జరిగే పరిస్థితి ఉంది. ఇది స్వాగతించదగ్గ విషయం. రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే సంఖ్యాపరంగా ఈ నెంబరు పెరగాలి. అప్పుడే రాష్ట్రాలకు అన్యాయం చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వాలు వెనకడుగువేస్తాయి. ఇందుకోసం కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న వేదిక మంచిది. ఈ విషయంపైనే కేసీఆర్‌ నాతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పుడు కేటీఆర్‌ నాతో చర్చించారు. మళ్లీ నేరుగా ఏపీ వచ్చి కేసీఆర్‌ నాతో మాట్లాడతానన్నారు. ప్రస్తుతం కేటీఆర్‌తో చర్చించిన విషయాలు పార్టీలో మరింత సుదీర్ఘంగా చర్చిస్తాం’’ అని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos