నేషనల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ఘన విజయం

నేషనల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ఘన విజయం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఘన విజయం సాధించారు. ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసిన తర్వాత ఈ ఫలితాలు ఆయనకు గొప్ప ఊరటనిస్తున్నాయి. ఎనిమిది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాల్లో ఆయన గెలిచారు. అధికార కూటమి అభ్యర్థులు పరాజయం పొందారు.ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్ప కూలింది. ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ లోని తన నివాసంలో విలేఖరులతో మంగళవారం మాట్లాడారు. ‘పీటీఐ బలహీనంగా ఉందని ప్రభుత్వం భావించిన స్థానాల్లో ఎన్నికలు నిర్వహించింది. ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటర్లు అధికార కూటమికి చెందిన ఉమ్మడి అభ్యర్థులను ఓడించారు. మేము అసెంబ్లీకి వెళ్లబోమని ఓటర్లకు తెలిసినప్పటికీ, మాకు ఓటు వేశారు. ఇదీ ప్రజాభిప్రాయమ’న్నారు. ఈ ఎనిమిది స్థానాలు గతంలో పీటీఐ అభ్యర్థులే గెలిచారు. పాకిస్థాన్లో ఒకే అభ్యర్థి అనేక స్థానాల్లో పోటీ చేయవచ్చు. గెలిచినవాటిలో ఏదో ఒక స్థానం నుంచి ప్రాతినిధ్యంవహిస్తూ, మిగిలిన స్థానాలకు రాజీనామా చేయవచ్చు. ఇమ్రాన్ ఖాన్ పోటీ చేసినన్ని స్థానాల్లో ఒకే వ్యక్తి పోటీ చేయడం చాలా అరుదు. ఏప్రిల్లో తన ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నేషనల్ అసెంబ్లీలోని తన పార్టీ సభ్యులందరి చేత ఆయన రాజీనామా చేయించారు. అయితే కేవలం ఎనిమిది స్థానాలకు మాత్రమే ఉప ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం గెలిచిన ఆరు స్థానాల్లో దేనికీ ఆయన ప్రాతినిధ్యంవహించబోరని, అన్నిటికీ రాజీనామా చేసేస్తారని ఆయన పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ స్థానాలకు మళ్ళీ ఉప ఎన్నికలు తప్పవని చెప్పాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos