తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు తీరంలో మరో ఆవర్తనం ఉంది. బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ శాఖాధికారులు మాట్లాడుతూ… పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా.. ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని తెలిపారు. దక్షిణ గంగేటిక్ పశ్చిమ బెంగాల్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, ఉపరితల ద్రోణి, అల్పపీడనం నుంచి తెలంగాణ వరకు కొనసాగుతుందన్నారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని, రానున్న 48 గంటల్లో హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

జలకళతో ప్రాజెక్టులు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తోడు మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది. వర్షాకాలం ముగింపు దశలోనూ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుగా కనిపిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos