హైకోర్టును ఆశ్రయించిన హత్రాస్ కుటుంబం

హైకోర్టును ఆశ్రయించిన హత్రాస్ కుటుంబం

ప్రయాగ్ రాజ్ : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తమను అక్రమంగా గృహ నిర్బంధం చేసిందని హత్రాస్ బాధితురాలి తండ్రి, తల్లి, ఇద్దరు సోదరులతో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులు అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో గురువారం వ్యాజ్యం దాఖలుచేసారు. ‘మా కుటుంబాన్ని అక్రమ నిర్బంధం నుంచి విడుదల చేసి, స్వేచ్ఛగా బయటికి వచ్చి ప్రజలను కలుసుకునే అవకాశం కల్పించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశిం చాల’ని వ్యాజ్యంలో కోరారు.‘గతనెల 29న జిల్లా యంత్రాంగం తమను ఇంట్లో నిర్బంధించింది. మొదట్లో ఎవరినీ కలుసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. తర్వాత కొద్ది రోజులకు కేవలం అతి కొద్ది మందిని తమను కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ.. ఇంట్లో నుంచి మాత్రం స్వేచ్ఛగా బయటికి రానివ్వడం లేదు. వాక్ స్వాతంత్ర్యానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు, సమాచారం పొందే హక్కులకు భంగం కలిగిస్తున్నార’ని ఆరోపించారు. బాధిత కుటుంబం తనకు ఫోన్ చేసి తమ తరపున పిటిషన్ దాఖలు చేయమని కోరిందని అఖిల భారతీయ వాల్మీకి మహా పంచాయత్ జాతీయ ప్రధాన కార్యదర్శి సురేందర్ కుమార్ ఈ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

తాజా సమాచారం