భావజాలమే పార్టీని గట్టెక్కిస్తుంది

భావజాలమే పార్టీని గట్టెక్కిస్తుంది

జైపూర్: కాంగ్రెస్ పార్టీ పై సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యకర్తలను మనోవేదనకు గురిచేశాయని రాజస్థాన్ ముఖ్య మంత్రి అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ట్విటర్లో అభిప్రాయపడ్డారు. ‘పార్టీ అంతర్గత వ్యవహారాల్ని కపిల్ సిబల్ మీడియా వద్ద ప్రస్తావించాల్సింది కాదు. అవి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీస్తాయి. గతంలోనూ పార్టీ పలు సమయాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంది. కానీ మా భావజాలం, కార్యక్రమాలు, పటిష్టమైన నాయకత్వం ఉండటంతో సంక్షోభ సమయాలనుంచి గట్టెక్కాం. ప్రతిసారీ మేం నిలదొక్కుకోగలిగాం. ఆ తర్వాత 2004లో సోనియా నాయకత్వంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా అదేవిధంగా మేం సంక్షోభ పరిస్థితులను అధిగమిస్తాం’ అని గహ్లాత్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఎన్నికల్లో ఓటమికి వివిధ రకాల కారణాలుంటాయి. అనేకసార్లు సంక్షోభాలు ఏర్పడినప్పటికీ దృఢమైన నాయకత్వం, ఐక్యతతో బయటపడ్డాం. ఈ రోజు వరకు కూడా దేశ సమగ్రతను కాపాడి, అభివృద్ధి పథంలో తీసుకువెళ్లగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్సే’ అని గహ్లోత్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos