రైతులకు బీజేపీ దగా

రైతులకు బీజేపీ దగా

న్యూ ఢిల్లీ: ఎన్నికల వేళ బీజేపీ నేతలు ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటూ పెద్దయెత్తున ప్రచారాన్ని అందుకొన్నారు. అయితే 2014, 2019 లోక్సభ ఎన్నికల సమయంతోపాటుగా మధ్యలో అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీల అమలు సంగతి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, పంటలకు కనీస మద్దతు ధర, రైతుల ఆదాయం రెట్టింపు అనే అంశాలు అందరి మదిలోనూ మెదలాడుతుంటాయి. పంటలకు ఎంఎస్పీ, రైతులు ఆదాయం రెట్టింపు కావడం అటుంచితే, ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభం కూరుకుపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదాయం లేక, అప్పులు బాధలు భరించలేక, పలు ఇతర కారణాలతో మోదీ గద్దెనెక్కిన 2014 నుంచి 2023 వరకు దాదాపు లక్షా 12 వేల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకొన్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా ఇదే కాలంలో రోజువారీ కూలీల ఆత్మహత్యల సంఖ్య 3,12,214 దాటింది. రైతులు, కూలీల ఆత్మహత్యల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని అంచనాలు వినిపిస్తున్నాయి.
అప్పుల ఊబిలో రైతులు
మరోవైపు దేశంలోని అనేక వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని, ఒక్కో కుటుంబంపై సగటున రూ.74,121 అప్పు ఉన్నదని నివేదికలు చెబుతున్నాయి. 2013తో పోలిస్తే రైతుల అప్పు 57 శాతం పెరిగింది. అదే ఈ అప్పుల్లో కూరుకుపోయిన రైతుల సంఖ్య 9.02 కోట్ల నుంచి 9.30 కోట్లకు పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉపాధి హామీ పథకానికి కూడా మోదీ సర్కార్ బడ్జెట్ కేటాయింపులు 33 శాతం తగ్గించింది. ఫసల్ బీమాతో కార్పొరేట్ కంపెనీలకు లాభాల పంట కేంద్రం అమలు చేస్తున్న పంటల బీమా పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన మాత్రం కార్పొరేట్ కంపెనీలు లాభాలు తెచ్చిపెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2016-22 వరకు బీమా రుసుం కింద రూ.1,97,657 కోట్లకు పైగా రైతులు చెల్లిస్తే, బీమా కంపెనీలు క్లెయిమ్లకు చెల్లించిన మొత్తం రూ.1,40,037 కోట్లు మాత్రమే. మోదీ సర్కార్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న మరో పథకం హర్ ఖేత్ కో పానీ. ప్రతి ఏడాది ఈ పథకంపై రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామంటూ ప్రకటించిన మోదీ ప్రభుత్వం.. మొత్తంగా పదేండ్లలో లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా రూ.30 వేల కోట్లు కూడా వ్యయం చేయలేదని గణాంకాలు చెబుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos