ఎన్నికల్లో గెలిస్తే…ఈపీఎస్‌కే మళ్లీ పట్టం

ఎన్నికల్లో గెలిస్తే…ఈపీఎస్‌కే మళ్లీ పట్టం

హోసూరు : తమిళనాడులో 2021లో జరిగే ఎన్నికలలో ఎడిఎంకె పార్టీ విజయం సాధిస్తే ఎడపాడి పళనిస్వామికే తిరిగి ముఖ్యమంత్రి  పీఠాన్ని కట్టబెట్టాలని ఆపార్టీ సీనియర్ నాయకులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఎడిఎంకె పార్టీ పగ్గాలు ఆమె  నెచ్చెలి శశికళ చేతికి వెళ్లాయి. ఆమెను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు ఆపార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నించినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో అసమ్మతి పెల్లుబికడంతో  ఎడపాడి పళనిస్వామికి ఆ పదవిని కట్టబెట్టాల్సి వచ్చింది. ఇదివరకు మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఓ. పన్నీర్‌ సెల్వంను కాదని  శశికళ ఆదేశాల మేరకు పళనిస్వామిని కూర్చోబెట్టాల్సి వచ్చింది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ, పెను సవాళ్లను సైతం అవలీలగా పరిష్కరించి పార్టీలోనే కాక తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పళనిస్వామి ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే పళనిస్వామిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని అధిష్టానంలో ఒక వర్గం బహిరంగంగా ప్రకటనలు చేయడంతో ఎడిఎంకెలో విబేధాలు భగ్గుమన్నాయి. ఓ. పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గీయుల మధ్య విభేదాలు తార స్థాయికి చేరడంతో సీనియర్ నాయకులు చర్చలు జరిపి, ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఎడపాడి పళనిస్వామికి కట్టబెట్టాలని నిర్ణయించి, ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. దీంతో తమిళనాడు రాష్ట్రంలో ఎడిఎంకె పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. హోసూరులో ఎడిఎంకె కార్యాలయం వద్ద పార్టీ నాయకులు రాము నేతృత్వంలో టపాసులు పేల్చి, స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిఎంకె పార్టీ నాయకులు అశోక్ రెడ్డి, జయప్రకాష్, నారాయణ రెడ్డి, నారాయణ, చంద్రన్,  శ్రీధర్ ఆపార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos