అడ్డంగా దొరికిన నకిలీ పోలీసులు..

దొరికితే దొంగ దొరక్కపోతే దొర సామెతను బాగా వంటిబట్టించుకున్నారేమో ముగ్గురు వ్యక్తులు పోలీసు వేషధారణలో రియల్‌ఎస్టేట్‌తో పాటు సెటిల్మెంట్లకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. జిల్లెలగూడ న్యూ గాయత్రినగర్‌కు చెందిన కసిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి హైదరాబాద్‌ నగరంలోని అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.దీంతోపాటు భార్య ప్రతిమరెడ్డి పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం,చిట్టీల వ్యాపారం నడుపుతున్నాడు. అయితే రెండింటిలోనూ ఆదాయం అంతంతమాత్రంగానే ఉండడంతో తనకు పరిచయం ఉన్న మాజీ హోంగార్డ్స్‌ దేవిరెడ్డి అక్కిరెడ్డి,అశోక్‌లతో ముఠాగా ఏర్పడి పోలీసుల అవతారం ఎత్తాడు.తాను ఎస్‌ఐగా వేషం వేయగా అశోక్‌,అక్కడిరెడ్డిలను కానిస్టేబుళ్లుగా మార్చాడు.తన ఫార్చూనర్‌ కారుకు పోలీసు సైరన్‌ తగిలించి కారులో తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ నిజమైన పోలీసులుగా నమ్మేవిధంగా ప్రవర్తించారు.నకిలీ ఐడీ కార్డులతో నిజమైన పోలీసులుగా చలామణి అవుతూ దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు,టోల్‌గేట్ల వద్ద రుసుములు చెల్లించకుండా దర్జాగా తిరిగసాగారు.చిట్‌ఫండ్‌ వ్యాపారంతో పాటు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో కూడా ఆరితేరారు.సెటిల్మెంట్లు చేస్తున్న సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే ఎయిర్‌గన్‌ చూపించి భయభ్రాంతులకు గురి చేసేవారు. ఈ క్రమంలో ఇటీవల యాదగిరిగుట్ట సమీపంలో కొంత భూమిని కొనుగోలు చేసిన ముగ్గురు రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్థలం యజమానితో మనస్పర్ధలు రావడంతో ముగ్గురు కలసి ఫార్చూనర్‌ కారులో బయలు దేరారు.ఎల్బీనగర్, సాగర్ రింగురోడ్డు సమీపంలోని అలేఖ్య టవర్స్ దగ్గర నిజమైన పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరి గుట్టురట్టైంది. సైరన్ మోగిస్తూ ఫార్చునర్ కారు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానం వచ్చి ఆరా తీయగా నకిలీ ఐడీ కార్డుల విషయం బయటపడింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. ఫార్చునర్ కారుతో పాటు ఎయిర్ గన్, 36వేల రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos