ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే దొడ్డమాకళి వెళ్లాల్సిందే..

  • In Tourism
  • October 21, 2019
  • 243 Views
ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే దొడ్డమాకళి వెళ్లాల్సిందే..

కర్ణాటక రాష్ట్రంలో వారంతం విడిదికి,ప్రకృతి ప్రేమికులు,వన్యప్రాణుల ప్రేమికుల,సాహసీలకు మరో చక్కటి ప్రదేశం దొడ్డమాకళి.రోజూ ఉద్యోగాలు,వ్యాపారాల ఒత్తిళ్లతో సతమతమయ్యే నగర వాసులతో పాటు ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నగరం నుంచి 132 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డమాకళికి పర్యాటకులు వారంతాల్లో ప్రకృతి ఒడిలో సేద తీరడానికి వస్తుంటారు.కావేరి నది తీరంలో ఎత్తైన కొండల అందం,వన్యప్రాణుల సంచారం వీక్షిస్తుంటే ఎంతటి ఒత్తిళ్లయినా మటుమాయం కావడం తథ్యం.అనువణువు ప్రకృతి అందాలతో అలరారే దొడ్డమాకళిలో ట్రెక్కింగ్ ప్రత్యేక అనుభూతి.

మేఘాలను తాకుతున్న దొడ్డమాకలి కొండలు


కొండలపై ట్రెక్కింగ్ చేస్తూ అక్కడే ఉన్న పురాతన శివాలయాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తారు.దొడ్డమాకళి సాహస క్రీడాభిమానులకు మంచి ప్రదేశం.కావేరి నదిలో కయాకింగ్, ర్యాఫ్టింగ్ వంటి జలక్రీడలు ఆహ్లాదాన్ని పంచుతాయి.దొడ్డమాకళి అడవుల్లో శతాబ్దాలుగా జీవిస్తున్న సోలిగ జాతి తెగల ప్రజల ఆచార వ్యవహారాలు,సంస్కృతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దొడ్డమాకళి సుమారు 200 జాతుల పక్షులకు నిలయంగా విరాజిల్లుతోంది.అరుదైన బ్లాక్ బెల్లీడ్ రివర్ టెర్న్, ఓస్ప్రే, గ్రే ఫిష్ ఈగిల్, కింగ్ ఫిషర్, వడ్రంగి పిట్టలు, మైనాలు, బాతులతో పాటు నీటి ఆధారిత పక్షులను చూసి పరవశించాల్సిందే.

కొండల మధ్య కావేరి హొయలు


వీటితో పాటు ఎలుగు బంటి,సంబార్, మచ్చల జింకలు, ఉడుతలు, చిరుతపులులు, ఏనుగులు, మలబార్ ఉడతలు, గుంట నక్కలు, పాములు, మొసళ్ళు, తాబేళ్ళు, ఊసర వెల్లులు ఎన్నో కనపడతాయి.దొడ్డమాకళిలో గలగల సవ్వడి చేస్తూ పారే కావేరి నదీలో ఫిషింగ్ మరో ప్రత్యేక అనుభవం. చేపలు పట్టడం, మరల వదిలేయడం పద్ధతిపై ఇక్కడ అనేకమంది ఆనందిస్తూంటారు. మహసీర్ మరియు మరికొన్ని స్ధానిక జాతి చేపలు ఇక్కడ దొరుకుతాయి. చేపలు పట్టటానికి అవసరమయ్యే శిక్షణ కూడా స్థానికంగా ఉన్న గైడ్స్‌ నుంచి పొందవచ్చు.

భీమేశ్వరి ఫిషింగ్‌ క్యాంప్‌


ఎంత పెద్ద జలపుష్పమో


భీమేశ్వరి జలపాతం


దొడ్డమాకళికి సమీపంలోని భీమేశ్వరి ఫిషింగ్ క్యాంప్‌, మేకేదాటు జలపాతాలు,సంగం,శింషా,చుంచి జలపాతాలు తిలకించకుంటే పర్యటనకు అర్థమే ఉండదు.వర్షాకాలం అనంతరం దొడ్డమాకళి ప్రదేశం పర్యటనకు అనువుగా ఉంటుంది.ఆకాశాన్ని తాకే కొండలు,వాటిని స్పృశిస్తూ తేలిపోయే మేఘాలు,అప్పుడప్పుడు పలుకరించే చిరు చినుకులు వాటి మధ్య అందమైన కావేరి నదీ తీరం నుంచి ఈ ప్రాంతం చూస్తుంటే స్వర్గంలో ఉన్నామనే భావన కలుగుతుంది..

చుంచి జలపాతం


శింషా జలపాతం


రివర్‌ రాఫ్టింగ్‌


ఎలా చేరుకోవాలి ?
బెంగుళూరు నుండి భీమేశ్వరికి రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ విరివిగా బస్సు సర్వీసులను నడుపుతోంది.బస్సులు లేదా ప్రైవేటు,సొంత వాహనాల్లో భీమేశ్వరి చేరుకొని అక్కడి నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల ఎగువన ఉండే దొడ్డమాకళి చేరుకోవచ్చు.దొడ్డమాకళికి రైలు సదుపాయం లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి రైలు వచ్చే పర్యాటకులు బెంగుళూరు సిటీ జంక్షన్ నుంచి దొడ్డమాకళికి ఆర్టీసీ బస్సులు లేదా టాక్సీల్లో చేరుకోవాలి.దొడ్డమాకళికి వచ్చే పర్యాటకుల కోసం రెసార్టులు సైతం వెలిశాయి.స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రెసార్టుల్లో అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos