దశాబ్దం గడిచినా ఆచూకీ లేని మరకత లింగం

  • In Tourism
  • October 29, 2019
  • 961 Views
దశాబ్దం గడిచినా ఆచూకీ లేని మరకత లింగం

హొసూరు : కృష్ణగిరి జిల్లా కుందుకోట సమీపంలోని మల్లిఖార్జున దుర్గం దేవాలయంలో 10 ఏళ్ల కిందట చోరీకి గురైన మరకత లింగం ఆచూకీ ఇంకా తెలియకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హొయసల రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం అతి పురాతనమైనది. తమ అభిరుచికి తగ్గట్టు శిల్ప కళతో ఆలయాన్ని నిర్మించడమే కాకుండా ప్రత్యేకంగా మరకత లింగాన్ని ప్రతిష్ఠించి హొయసల రాజులు పూజలు నిర్వహించారు. వారి హయాం తరువాత కూడా ఆలయ అభివృద్ధి సాగుతూ వచ్చింది. మరకత లింగానికి ఓ ప్రత్యేకత ఉందని స్థానికులు నేటికి చెబుతారు. లింగంపై ఎన్ని బిందెలు పాలు పోసినా పాలు ఇమిరిపోయేదని, ఒక్క చుక్క పాలు కూడా బయటకు వచ్చేది కాదని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు నేటికీ చెబుతున్నారు. అదే లింగంపై నీరు పోస్తే మొత్తం బయటకు వచ్చేవని తెలిపారు. ఇంతటి ప్రత్యేకత గల మరకత లింగాన్ని 10 ఏళ్ల కిందట గుర్తు తెలియని వ్యక్తులు పెకిలించి చోరీ చేశారు. దీనిపై స్థానికులు డెంకణీకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేటికీ లింగం ఆచూకీ తెలియలేదు. ప్రస్తుతం ఆలయంలో మరో లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా తమిళనాడులోని పలు పురాతన దేవాలయాలలో పంచలోహ విగ్రహాలను చోరీ చేసిన వారిని వెతికి పట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పొన్ మాణిక్యవేలు అనే పోలీసు అధికారిని నియమించింది. ఆయన పలు కేసులను ఛేదించి విగ్రహాలను తెచ్చి ఆయా ఆలయాలకు చేర్చారు. తమిళనాడులోని వివిధ దేవాలయాలలో దొంగలించి విదేశాలలో పంచలోహ విగ్రహాలను విక్రయించిన పలువురిని అరెస్టు చేయడమే కాకుండా కోట్ల రూపాయలు విలువ చేసే పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరకత లింగం ఆచూకీని కనుక్కోవడానికి సత్వర చర్యలు చేపట్టాలని కుందుకోట, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos