ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు

ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు

హైదరాబాదు: ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం గత 14 నే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధిపతుల పదవీ కాల పొడిగింపు ఆర్డినెన్సులు తెచ్చింది. ఆర్డినెన్సుల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొవటం ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం. దాన్ని అత్యవసర పరిస్థితుల్లోనే ప్రయోగించాలి తప్ప చట్టసభల అగ్ర ప్రాధాన్యాన్ని నీరుగార్చ రాదు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాలను పొడిగించడం ప్రస్తుతం నడుస్తున్న కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేయడానికి తోడ్పడే మాట నిజం. అయితే, ఈ రెండు సంస్థలను అధికార స్థానాల్లో ఉన్నవారు సక్రమంగా పని చేయనిస్తున్నారా అంటే, సందేహమే. ఇలాంటి అపశ్రుతులను నివారించాంటే పార్లమెంటులో కూలంకషంగా చర్చించి, అవసరమైన మార్పుచేర్పులతో చట్టాలను పకడ్బందీగా రూపొందించాలి. అలాకాకుండా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఆదరాబాదరాగా ఆర్డినెన్సులు జారీ చేయడం పాలకుల సొంత రాజకీయ ప్రయోజనాల కోసమేననే విమర్శలకు తావిచ్చింది.చేంతాడంత జాబితా!రాజ్యాంగం ప్రకారం ఒక అంశంపై పార్లమెంటులో, రాష్ట్ర లెజిస్లేచర్లో, వివిధ స్థాయీసంఘాల్లో, సంయుక్త సంఘాల్లో చర్చలు జరిపిన తరవాతే సమగ్ర చట్టం చేయాలి. దీనికి విరుద్ధంగా మొదట ఆర్డినెన్సులు జారీ చేసి, తరవాత చట్టాలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలోనూ అదే జరిగింది. రైతుల సమస్యలను పార్లమెంటులో లోతుగా చర్చించి, సమగ్ర పరిష్కారాలతో చట్టాలు చేయాల్సింది పోయి, ఎన్డీఏ సర్కారు హడావుడిగా ఆర్డినెన్సు తీసుకువచ్చింది. ఆపైన తీరిగ్గా పార్లమెంటులో చట్టాలు చేసింది. వాటిని నిరసిస్తూ ఏడాది కాలంగా రైతులు నడిపిన ఉద్యమానికి తలొగ్గి సాగు చట్టాలను రద్దు నిర్ణయం ప్రకటించక తప్పలేదు! దేశంలో ఆర్డినెన్సు పాలనకు సుదీర్ఘ చరిత్ర ఉంది. యూపీఏ తన పదేళ్ల పాలనలో 61 ఆర్డినెన్సులు తీసుకొస్తే, మోదీ సర్కారు ఏడేళ్లలో ఏకంగా 79 ఆర్డినెన్సులు జారీ చేసింది. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉంది. సమాజ అవసరాలను తీర్చడానికి చట్టసభలు ఎంతో తర్జన భర్జన జరిపి మరీ చట్టాలు చేస్తాయి. రాష్ట్రపతి, గవర్నర్లు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆర్డినెన్సులు జారీ చేయాలి. ఆర్డినెన్సుల ద్వారా రాజ్యాంగ సవరణ చేసే వీలులేదు. రాష్ట్రపతి, గవర్నర్ల ఆర్డినెన్సు అధికారం మీద సమీక్ష జరిపే హక్కు న్యాయ వ్యవస్థకు ఉంటుంది. ఆర్డినెన్సులు జారీ చేసే అధికారాన్ని రాష్ట్రపతికి, గవర్నర్లకు రాజ్యాంగం దఖలు పరుస్తోంది. 1) ఏదైనా అత్యవసర స్థితి లేక అసాధారణ స్థితి ఎదురైనప్పుడు దాన్ని తక్షణం ఎదుర్కోవడానికి ఆర్డినెన్సు జారీ చేయవచ్చు.2)చట్టసభల సమావేశాలు జరగనప్పుడు ఏదైనా అవాంతరం వస్తే ఆర్డినెన్సు చేయవచ్చు.3) కేవలం ప్రజాహితం కోసమే ఆర్డినెన్సులు చేయాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos