రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ ఆగ్రహం

రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ ఆగ్రహం

ఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేయడం… దానికి ఆగమేఘాల మీద కేంద్రం ఆమోదం తెలపడం తదితర పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం ద్వారా గవర్నర్ కోష్యారీ రాజ్యాంగ ప్రక్రియను అపహాస్యం చేశారంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సుర్జేవాలా ట్విటర్‌లో స్పందిస్తూ… ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో చెప్పినట్టు నాలుగు దారుణమైన ఉల్లంఘనలు ఈ నిర్ణయంలో జరిగాయని ఆరోపించారు. ‘మహారాష్ట్రలో ఏ పార్టీకీ మెజారిటీ రానందున… ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న శివసేన-బీజేపీ కూటమిని ఆహ్వానించాల్సింది. వాళ్లు రాని పక్షంలో ఎన్నికల్లో రెండో అతి పెద్ద కూటమిగా ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీలను ఆహ్వానించాలి. ఒకవేళ పార్టీల పరంగా గవర్నర్ పిలవదల్చుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీని ఎందుకు పిలవలేదు? సమయం విషయంలో కూడా ఎందుకు పూర్తి పక్షపాతం చూపించినట్టు? బీజేపీకి 48 గంటలు, శివసేనకు 24 గంటలు ఇచ్చి… ఎన్సీపీకి కనీసం 24 గంటలు కూడా అవకాశం ఇవ్వలేదు. అంతలోనే రాష్ట్రపతి పాలన విధించారు. ఇది ఏమాత్రం నిజాయితీ లేకుండా రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే’ అని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ సైతం గవర్నర్ కోష్యారీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గవర్నర్ కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos