కుదరదు అనడానికీ కుదరదా?

సి. నారాయణ రెడ్డి గొప్ప వక్త. వేదిక ఏదైనా ఆయన ఉపన్యాసం ప్రవాహంలా సాగిపోయి శ్రోతలను ఆనందపరవశులను చేసేది. ఒక నాటక కళాపరిషత్తు నిర్వహించిన పోటీలలో నేను న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. మొదటిరోజు సినారెకు సన్మానం ఏర్పాటు చేశారు. ఒకాయన వేదిక మీద ఉన్నవారిని మితిమీరి పొగుడుతూ ‘‘ఇది నిజంగా మయసభలా ఉంది’’ అన్నాడు. చివరగా సినారె మాట్లాడుతూ ‘‘ఇంతకుముందు మాట్లాడినవారు దీనిని మయసభ అన్నారు. మయసభ అంటే ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ కనిపించే ప్రమాదం ఉంది. అయినా పెద్దలమాట కొట్టేయకుండా– ఇంతమంది కవులూ, కళాకారులూ పాల్గొన్న ఈ సభ మయసభ కాదు– వాఙ్మయ సభ అనుకుందాం!’’ అని చమత్కరించారు.
సినారె అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పర్యటిస్తున్నప్పుడు ఒక కార్యాలయ ఉద్యోగులు కొన్ని ఆంగ్లపదాలు సూచిస్తూ ‘‘అన్నిటికీ తెలుగులో సరైన పదాలు దొరకవండీ’’ అంటూ వితండవాదం చేశారు. సినారె ముఖం మీద చిరునవ్వు చెరగకుండా చక్కని సమాధానం ఇచ్చారు: ‘‘మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ఆలోచించడం లేదు. లీవ్‌ లెటర్‌ బదులుగా ‘సెలవు చీటి’ అని రాయండి. గ్రాంటెడ్‌ అనడానికి ‘అలాగే’ అని రాయండి. రిజెక్టెడ్‌ అనాలంటే ‘కుదరదు’ అనండి. అదీ కాకపోతే ‘ఊహూ’ అని రాసి సంతకం పెట్టండి!’’ అన్నారు. ఉద్యోగులు మళ్లీ నోరెత్తలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos