కార్పొరేట్ల చేతుల్లోకి ప్రభుత్వ ఆస్తులు

న్యూఢిల్లీ : జాతీయ నగదీకరణ ప్రణాళిక (నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ -ఎన్ఎంపి) పేరుతో ప్రభుత్వ రంగ ఆస్తుల్ని తెగనమ్మాలని చూస్తోన్న మోడీ సర్కార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గత 70 సంవత్సరాలుగా నిర్మించినవన్నీ.. మోడీ ప్రభుత్వం కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో తాకట్టు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని గుర్తించి.. ప్రజలందరూ ఈ పాలసీని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయాలి’ అని అన్నారు. అంతేకాకుడా… ‘ఎకనామిక్స్‌లో ఆస్తి స్ట్రిప్పింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ జరుగుతున్నది అదే. ఈ పాలసీపై ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. పార్లమెంటులో చర్చ జరగలేదు. ఈ సమస్యపై ప్రభుత్వం ఎప్పటికీ చర్చకు అనుమతించదు. దీనిపై ప్రతిపక్షాలు ప్రశ్నలు అడిగినా.. ప్రధాని మోడీతోపాటు.. ఆర్థికమంత్రి సీతారామన్ కూడా సమాధానం ఇవ్వరు’ అని ఆయన అన్నారు.
ఎన్ఎంపి పేరుతో రానున్న నాలుగేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ఆస్తుల్ని అమ్మి 6 లక్షల కోట్ల నిధులు సమీకరించాలని గత నెలలో కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నవాటినే విక్రయించింది. కీలకమైన ఆస్తుల్ని అమ్మే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు. అయితే మోడీ ప్రభుత్వం మాత్రం అన్నింటినీ అమ్మేయాలని చూస్తోంది. కొంకణ్ రైల్వే, ఢిల్లీ – ముంబై సరుకు రవాణా కారిడార్‌ను సైతం విక్రయించాలని యోచిస్తోందని చిదంబరం పేర్కొన్నారు. ఈ ఆస్తుల్ని విక్రయించడంపై ఆయన స్పందిస్తూ… ఆస్తుల్ని అమ్మడం వల్ల రూ.1.5 లక్షల కోట్లు సంపాదించొచ్చని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. అయితే అసలు ఈ ఆస్తుల వల్ల ఎంత ఉత్పత్తి జరుగుతుంది? దాని వల్ల ఎంత ఆదాయం వస్తుందనేది కేంద్రం ఎందుకు వెల్లడించడంలేదు అని ఆయన ప్రశ్నించారు. ఈ ఆస్తులు ప్రస్తుతం రూ.1.3 లక్షల కోట్లు విలువ చేస్తాయి. కేవలం రెండు లక్షల కోట్ల రూపాయల కోసం… 70 ఏళ్లుగా ఉన్న ఆస్తుల్ని అమ్మాలని చూడడం… దానిని ప్రభుత్వం సమర్థించుకోవడం ఎంతమాత్రం సరికాదని చిదంబరం పేర్కొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos