ఆధ్యాత్మికం ఆహ్లాదం రెండూ ఒకేచోట..

  • In Tourism
  • September 5, 2019
  • 284 Views
ఆధ్యాత్మికం ఆహ్లాదం రెండూ ఒకేచోట..

ఆధ్యాత్మికంతో పాటు ప్రకృతి ఒడిలో ఆహ్లాదం కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం బీఆర్ హిల్స్ అలియాస్ బిలిగిరి రంగన్న హిల్స్.కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర జిల్లాలో ఆగ్నేయ దిశలో తమిళనాడు సరిహద్దుల్లో పశ్చిమ,తూర్పు కనుమలు కలిసే ఈ బీఆర్ హిల్స్ ప్రకృతి అందాలకు,జీవ వైవిధ్యానికి, వన్యప్రాణులు, క్రూరమృగాలు మరెన్నో జాతుల పక్షులకు ఆలవాలంగా విరాజిల్లుతోంది.ఇక్కడి తెల్లటి కొండల అగ్రభాగాన నిర్మించిన రంగస్వామి దేవాలయం పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని బిలిగిరి రంగన్న కొండలుగా పిలుస్తుంటారు.సముద్ర మట్టం నుంచి సుమారు ఐదు వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉండే బీఆర్ హిల్స్లో ఎన్నో రకాల వృక్ష జాతులు కనపడతాయి.ఈ వృక్ష సంపదే ఆహారంగా పక్షులు,కొన్ని వన్యప్రాణులు ఈ అటవీప్రాంతంలో మనుగడ సాగిస్తున్నాయి.ఇక్కడి వన్యప్రాణుల సంరక్షణ కోసం బీఆర్టీ వైల్డ్లైఫ్ శాంక్చువరీని కూడా ఏర్పాటు చేశారు.తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం అడవులు సరిహద్దుగా కలిగి ఉండే బీఆర్ హిల్స్ అటవీప్రాంతంలో అడవి ఎలుగులు, దున్నలు, పులులు, చిరుతలు, వేట కుక్కలు, ఏనుగులు, నాలుగు కొమ్ముల దుప్పులు ఎన్నో ఉంటాయి. ఈ రక్షిత అడవిలో 200 కు పైగా పక్షి జాతులున్నాయి.ట్రెక్కింగ్, ర్యాఫ్టింగ్ వంటి సాహస కృత్యాలు చేయాలనుకునే సాహసీకులకు కావేరి మరియు కపిల నదుల సంగమమైన బీఆర్ హిల్స్ చాలా సౌకర్యంగా ఉంటుంది.ఇక ఇక్కడి గోరుకన,శివనసముద్ర జలపాతాలు బీఆర్ హాల్స్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో చేపలు పట్టడం, బోట్ విహారం వంటివి కూడా చేయవచ్చు.జలపాతాల సమీపంలో చెక్కలతో నిర్మించిన శిబిరాలు చూడముచ్చటగా ఉంటాయి.ఒకట్రెండు రోజులు కుటుంబంతో, స్నేహితులతో బీఆర్ హిల్స్లో గడపడానికి ఈ శిబిరాల్లో బస చేయవచ్చు.సహచరిణి రంగనాయకితో కలిసి కొలువై ఉన్న రంగస్వామి దేవాలయంలో ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో దేవాలయ ఉత్సవాలు,వేడుకలు అంగరంగ వైభవంగా ఉంటాయి.పర్యాటకులు, స్ధానిక తెగల ప్రజలు కలిసి ఈ సమయంలో దేవాలయ ఉత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఈ వేడుకలను తిలకించడానికి జిల్లాతో పాటు కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు,పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.జూన్ నుంచి అక్టోబర్ వరకు బీఆర్ హిల్స్ చూడడానికి అనువైన సమయం.చామరాజనగర జిల్లా కేంద్రంతో పాటు మైసూరు,కొల్లేగాల,కనకపురల నుంచి రోడ్డు మార్గం మీదుగా ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. చామరాజనగర లేదా మైసూరుకు రైలు మార్గంలో చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos